కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి ఎమ్మెల్యే, విప్ గంప గోవర్ధన్ రైస్‌మిల్లు గుమాస్తాపై చేయిచేసుకున్నారు. ఆఫీసర్లు, మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, పార్టీ లీడర్ల సమక్షంలోనే దాడి చేశారు. ఎమ్మెల్యే కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సెంటర్ల నుంచి వెళ్లిన లారీలు, ట్రాక్టర్లలోని వడ్లను మిల్లర్లు సకాలంలో దింపుకోవడం లేదని, తేమ శాతం ఎక్కువగా ఉందంటూ ఇబ్బందులు పెడుతున్నారని పలువురు రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం మాచారెడ్డి మండలం ఫరీద్‌పేట లోని రైస్‌మిల్లుకు ఆయన వెళ్లారు. అక్కడ మిల్లు ప్రతినిధుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత భిక్కనూరు మండలం బస్వాపూర్ శివారులోని పూర్ణిమ రైస్ మిల్లుకు శుక్రవారం రాత్రి వెళ్లారు. ఆయన వెంట రెవెన్యూ, సివిల్ సప్లై, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు. శుక్రవారం ఉదయం తీసుకొచ్చిన రెండు ట్రాక్టర్ల లోని వడ్లను దించుకోలేదని, తేమ శాతం ఎక్కువగా ఉందని వేధిస్తున్నారని రైతులు ఎమ్మెల్యే దృష్టికి వెళ్లారు. 18 శాతం తేమ ఉన్నా దించుకోవాలని చెప్పినా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని రైస్ మిల్లు ఓనర్లపై, గుమస్తాపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి ఎదుటే గుమాస్తా బాలును కొట్టారు. ఎమ్మెల్యే రైస్ మిల్లుకు వచ్చి గుమాస్తాపై దాడి చేయడాన్ని నిరసిస్తూ మిల్లర్లు శుక్రవారం రాత్రి నుంచి వడ్ల ఆన్లోడింగ్ నిలిపివేశారు.
శనివారం మధ్యాహ్నం మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టరేట్లో కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌ను కలిసి దాడి గురించి వివరించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నందున వడ్లను దింపుకోవాలని వారికి కలెక్టర్ సూచించారు. దాంతో శనివారం సాయంత్రం నుంచి అన్లోడింగ్ ప్రారంభించారు. కాగా, మిల్లు సిబ్బందిపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేయిచేసుకోవడం విచారకరమని, మిల్లర్లకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ కామారెడ్డి నియోజక వర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి డిమాండ్ చేశారు.