మూసీ నిర్వాసితులకు గచ్చిబౌలిలో ఇండ్లు కట్టివ్వాలి : హరీశ్​ రావు

మూసీ నిర్వాసితులకు గచ్చిబౌలిలో  ఇండ్లు కట్టివ్వాలి : హరీశ్​ రావు
  • మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్​ నిర్వాసితులకు న్యాయం చేసినం: హరీశ్​ రావు

గజ్వేల్/మానకొండూర్ (తిమ్మాపూర్​), వెలుగు: మూసీ నిర్వాసితులందరికీ గచ్చిబౌలిలో 250 గజాల విస్తీర్ణంలో డబుల్​ బెడ్​రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు డిమాండ్​ చేశారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్​ నిర్వాసితులకు తాము అన్ని విధాలుగా న్యాయం చేశామని చెప్పారు. 

వారికి దేశంలోనే నంబర్ ​వన్​ఆర్​ అండ్​ ఆర్​ కాలనీని 675 ఎకరాల్లో  నిర్మించామని తెలిపారు. నిర్వాసితులపై కాంగ్రెస్ నాయకులు ఈ మధ్య కపటప్రేమ ఒలకబోస్తున్నారని అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీశ్​రావు మీడియాతో మాట్లాడారు. 

తమ సర్కారు మల్లన్నసాగర్ , కొండపోచమ్మ సాగర్​ బాధితులకు పాత ఇండ్లకు  రూ.694  కోట్లు కేటాయించిందని చెప్పారు.  ఇంటి యజమానికి ఉపాధి కింద  7 లక్షల 50 వేలు ఇచ్చామని, ఇంట్లో పెళ్లికాని మగ, ఆడ పిల్లలకు రూ.5 లక్షలు  ఇచ్చామన్నారు. అందరికీ డబుల్​ బెడ్​ రూం ఇండ్లు కట్టించి ఇచ్చామని తెలిపారు.

 పెండ్లికాని పిల్లలకు 250 గజాల ఖాళీ స్థలం కూడా ఇచ్చినట్టు చెప్పారు. గజ్వేల్​పట్టణ నడిబొడ్డునే డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇచ్చినట్టు తెలిపారు.  సీఎం రేవంత్​ మాత్రం మూసీలో ఇండ్లు కూల్చి, నిర్వాసితులకు కేసీఆర్ కట్టించిన డబుల్​ బెడ్​ రూం ఇండ్లనే ఇస్తున్నాడన్నారు.  

మల్లన్నసాగర్ నిర్వాసితులకు డబుల్​ బెడ్​ రూం ఇండ్లు ఇవ్వలేదని రేవంత్​రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని, తాము గజ్వేల్​లో మొత్తం 3,414 ఇండ్లు నిర్మించి ఇచ్చామని చెప్పారు. 8 వేల మందికి 250 గజాల  ఇంటి స్థలాలు ఇచ్చి, నిర్మాణానికి 5 లక్షలు అందజేసినట్టు చెప్పారు. మల్లన్నసాగర్ నిర్వాసితులలో మిగిలిన వారికి నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర సర్కారును హరీశ్​రావు డిమాండ్​ చేశారు. 

సర్కారు తప్పులను ఎత్తిచూపడమే మా బాధ్యత  

ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపడమే ప్రతిపక్షం బాధ్యత అని, ఆ పనే కేసీఆర్ చేస్తున్నారని -హరీశ్​రావు అన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ మీద పోరాటానికి మళ్లీ ధూంధాం మొదలుపెట్టే రోజులు వచ్చాయని తెలిపారు. కరీంనగర్‌‌‌‌ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లిలో  ఆదివారం  మానకొండూర్ నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం- ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో హరీశ్​ మాట్లాడారు. 

కరోనా సమయంలోనూ కేసీఆర్  రైతు బంధు ఆపలేదని, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు ఆపి పెట్టుబడి సాయం ఇచ్చారని గుర్తుచేశారు.  కానీ రేవంత్​ సర్కారు రైతు బంధును బంద్​ పెట్టిందని అన్నారు. ఆయన ఎనుముల రేవంత్​రెడ్డి కాదని.. ఎగవేతల రేవంత్​రెడ్డి అని కామెంట్​ చేశారు.  ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తా అని దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన ఏకైక సీఎం రేవంత్ అని విమర్శించారు.