కాళేశ్వరం కమిషన్ రిపోర్టు రాజకీయ ప్రేరేపితం, చట్టబద్ధం కాదు: హరీశ్ రావు

కాళేశ్వరం కమిషన్ రిపోర్టు రాజకీయ ప్రేరేపితం,  చట్టబద్ధం కాదు: హరీశ్ రావు
  • కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి విమర్శలు 
  • మసిపూసి మారేడు కాయ చేయడంలో సీఎం సిద్ధహస్తుడు 
  • రిటైర్డ్ ఇంజనీర్ల సూచనల మేరకే.. ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చాం 
  • బీఆర్ఎస్​లో ఉన్నప్పుడు పొంగులేటి ఎందుకు ప్రశ్నించలే? 
  • 660 పేజీల నివేదికపై చర్చించేందుకు అరగంటేనా? 
  • తమ హక్కులను పీసీ ఘోష్ కాలరాశారని ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌‌‌‌ పీసీ ఘోష్‌‌‌‌ కమిషన్‌‌‌‌ సమర్పించిన నివేదిక రాజకీయ ప్రేరేపితమని, అదొక డొల్ల, చెత్త రిపోర్ట్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నివేదిక న్యాయస్థానంలో నిలబడదని అన్నారు. ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. కమిషన్‌‌‌‌ విచారణ నిష్పాక్షికంగా సాగలేదని ఆరోపించారు. విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్‌‌‌‌ 8బీ, 8సీ ప్రకారం సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, కమిషన్ ఆ నిబంధన పాటించలేదన్నారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. ఈ నివేదిక చట్టబద్ధంగా చెల్లదని.. చెత్త కాగితంతో సమానమన్నారు. ఇప్పటికే ఈ నివేదికను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఆరోపణలు చేసి, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం సరికాదన్నారు. తమ హక్కుల కోసం కోర్టుకు వెళ్లామని, అసెంబ్లీలో చర్చ చేయవద్దని కాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌కు గానీ, తనకు గానీ, విచారణకు పిలిచిన ఇతర నేతలకు, అధికారులకు గానీ నోటీసులు ఇవ్వలేదని, అందువల్ల ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగలేదన్నారు. సెక్షన్ 8బీ, 8సీని పాటించనందున 1952 కమిషన్ యాక్ట్ ప్రకారం ఈ రిపోర్ట్ చెల్లదన్నారు. 

రాజకీయ కక్ష సాధింపు.. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక చట్టబద్ధం కాదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌‌‌‌కు, బీఆర్ఎస్‌‌‌‌కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి భూసేకరణను అడ్డుకున్నారని అన్నారు. అధికారంలోకి వస్తే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారని, ఇప్పుడు ఘోష్ కమిషన్‌‌‌‌ ఏర్పాటు చేసి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం 2015లోనే స్పష్టం చేసిందని హరీశ్ రావు చెప్పారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి మసిపూసి మారేడు కాయ చేయడంలో సిద్ధహస్తుడు” అని విమర్శించారు. ప్రాణహిత ప్రాజెక్టును కొనసాగించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని, నీటి లభ్యత లేకపోవడం, మహారాష్ట్ర అంగీకరించకపోవడం, చాప్రాల్ వైల్డ్ లైఫ్ సమస్యలతో ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్ పై కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఏడాదిలోనే 11 అనుమతులు తెచ్చామన్నారు. కాంగ్రెస్ 2009 నుంచి 2014 మధ్య అధికారంలో ఉన్నా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని హరీశ్ రావు ప్రశ్నించారు.  

రిటైర్డ్ ఇంజనీర్ల సూచనమే మేరకే..

రిటైర్డ్ ఇంజనీర్ల సూచనల మేరకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించామని, వారి రిపోర్టును కమిషన్ విస్మరించిందని హరీశ్ రావు ఆరోపించారు. ‘‘ప్రాజెక్టు స్థల మార్పు, నిర్మాణం అంతా రిటైర్డ్ ఇంజినీర్ల సూచనల ప్రకారమే జరిగింది. ఎక్స్​పర్ట్ కమిటీ సూచనలనే గత బీఆర్ఎస్ సర్కారు పాటించిందన్నారు. ఘోష్ కమిషన్‌‌‌‌ ‘పీసీసీ కమిషన్’గా వ్యవహరించింది” అని విమర్శించారు. డీపీఆర్ లేకుండా టెండర్లు పిలిచారనే ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రాణహితకు 2009లో డీపీఆర్ వచ్చినా 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, జలయజ్ఞంలో అనేక ప్రాజెక్టులకు ఇలాగే చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఏడో బ్లాకులో రెండు పిల్లర్లు కుంగినా మొత్తం వ్యవస్థ అద్భుతంగా ఉందన్నారు. ఏడో బ్లాకును తీసేసినా రూ. 300 కోట్ల నుంచి రూ. -400 కోట్ల ఖర్చు మాత్రమే అవుతుందని, అయినా ప్రభుత్వం రాజకీయం చేస్తోందన్నారు.   

మంత్రులతో హరీశ్ వాగ్వాదం 

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించవద్దని కోర్టుకు వెళ్లారన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలపై హరీశ్ స్పందిస్తూ.. తాము రిపోర్టును కొట్టేయాలని వెళ్లాం తప్ప.. అసెంబ్లీలో చర్చించొద్దని కాదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిటిషన్ కాపీ తెప్పించుకుని చదువుకోవాలన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సబ్జెక్ట్‌‌‌‌ మాట్లాడండి.. మాట మార్చొద్దు’ అని హరీశ్ ను ఉద్దేశించి అన్నారు. దీంతో మాట మార్చే అలవాటు ఆయనకే ఉంటుందని, తనకు లేదన్నారు. కాళేశ్వరంలాంటి గొప్ప ప్రాజెక్టు చరిత్రలోనే లేదని గతంలో వెంకట్ రెడ్డి అన్నారని.. స్పీకర్ అనుమతిస్తే ఆ వీడియోను చూపిస్తానన్నారు. మంత్రి కోమటిరెడ్డి మళ్లీ అడ్డు తగలడంతో హరీశ్ స్పందిస్తూ.. ‘‘నేను సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పటికే ఐదు సార్లు అడ్డుతగిలారు. గతంలో కాళేశ్వరంపై ప్రజంటేషన్ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ అయి రాలేదని పోయిండు” అని అన్నారు. 

దీంతో ఉత్తమ్ స్పందిస్తూ.. హరీశ్ రావు జరగని సంఘటనను జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారని, హద్దులు దాటొద్దని హెచ్చరించారు. హరీశ్ స్పందిస్తూ.. ‘‘మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్‌‌‌‌లోకి వెళ్తున్నడు. దేమైనా ఈ విషయాన్ని వదిలేస్తున్నా’’ అని ప్రసంగాన్ని కొనసాగించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ గొప్పదని ఇప్పుడు చెప్తున్నారని, కానీ పార్లమెంట్‌‌‌‌లో దాని బిల్లును వ్యతిరేకించారని హరీశ్ రావు విమర్శించారు. పోలవరం పది సార్లు కూలినా ఎన్డీఎస్ఏ దానిపై దృష్టి పెట్టలేదని, కానీ కాళేశ్వరానికి మాత్రం వచ్చిందని ఆరోపించారు. చర్చలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటర్​ఫియర్ అవుతూ.. తుమ్మిడిహెట్టి దగ్గర ఎంతైతే వాటర్ ఉందో.. మేడిగడ్డ వద్దా అంతే వాటర్​ఉందన్నారు. అక్కడ ఏ ఉపనది వచ్చి కలుస్తదో హరీశ్ రావు చెప్పాలన్నారు. తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ మధ్య కేవలం పెద్ద వాగు మాత్రమే ఉందని, అక్కడ 10 టీఎంసీల నీళ్లు కూడా లేవని సిర్పూర్​ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ అన్నారు. మేడిగడ్డపై హరీశ్ మాటల్లో వాస్తవం లేదన్నారు. ​  

పొంగులేటి అప్పుడెందుకు ప్రశ్నించలే? 

సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో పొంగులేటి కేసీఆర్ పక్కనే ఉన్నారని, ఆయన అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని హరీశ్ రావు నిలదీశారు. సీతారామ ప్రాజెక్టు కోసం ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారని, కాళేశ్వరంపై కేసీఆర్ ను పొగుడుతూ ట్వీట్ కూడా చేశారన్నారు. పొంగులేలి తొమ్మిది ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, ఈ ప్రాజెక్టులను అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఒప్పు.. కాంగ్రెస్ లోకి వెళ్లగానే తప్పైతదా? అని ప్రశ్నించారు.  తన బిడ్డను కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్లాల్సి ఉన్నా.. వాయిదా వేసుకుని ముఖ్యమైన సబ్జెక్ట్ అని అసెంబ్లీకి  వస్తే మాట్లాడనివ్వడం లేదని హరీశ్ అన్నారు. 660 పేజీల నివేదికపై మాట్లాడేందుకు కేవలం అరగంట సమయం ఇవ్వడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం రెండు గంటల సమయం ఇవ్వాలన్నారు. అవసరమైతే మరో రెండు రోజులు కూడా చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.