V6 News

కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణే లేదు..ఆయన దీక్ష ఫలితమే స్వరాష్ట్రం: హరీశ్ రావు

కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణే లేదు..ఆయన దీక్ష ఫలితమే స్వరాష్ట్రం: హరీశ్ రావు
  •  డిసెంబర్​9 విజయ్​దివస్​.. 23 విద్రోహ దినమని వ్యాఖ్య 

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ‘‘తెలంగాణ చరిత్రలో డిసెంబర్ 9 సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. నాడు నవంబర్​29న కేసీఆర్​చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితంగానే డిసెంబర్ ​9 తెలంగాణ ప్రకటన వచ్చింది. కేసీఆర్​ప్రాణాలకు తెగించి కొట్లాడకపోతే డిసెంబర్​9న ప్రకటన వచ్చేది కాదు. జూన్​2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉండేది కాదు” అని వ్యాఖ్యానించారు. 

డిసెంబర్ 9న తెలంగాణను ప్రకటించిన సోనియా గాంధీ.. ఆ తర్వాత ఆంధ్రోళ్ల ఒత్తిళ్లకు తలొగ్గి డిసెంబర్​23న ప్రకటనను వెనక్కు తీసుకున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 9న విజయ్ దివస్ ఎట్లాగో.. అట్లాగే డిసెంబర్ 23ను విద్రోహ దినంగా ప్రకటించాలని డిమాండ్​చేశారు. మంగళవారం తెలంంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో విజయ్​దివస్​కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడుతూ.. కేసీఆర్​దీక్ష, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ అని పేర్కొన్నారు.

 ‘‘కేసీఆర్​అంటే పోరాటం, త్యాగం. రేవంత్​రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం. ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయాలని అడిగితే.. జిరాక్స్​పేపర్లు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి రేవంత్​ రెడ్డి. ఉద్యమకారుల పైకి రైఫిల్​పట్టుకుపోయిన చరిత్ర ఆయనది’’ అని మండిపడ్డారు. దీక్ష, పోరాటాల వల్ల కేసీఆర్​ఆయుష్షు పదేండ్లు తగ్గిపోయిందన్నారు. ‘‘కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారు. దేవుడి దయ, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ఆయన​ఆరోగ్యంగా ఉన్నారు. ప్రజల తరఫున మళ్లీ పోరాటం చేస్తారు.. సీఎం అవుతారు” అని ధీమా వ్యక్తం చేశారు. 

రేవంత్​పెట్టింది నకిలీ తెలంగాణ తల్లి.. 

తెలంగాణ తల్లి ఉద్యమ భావోద్వేగాల మధ్య, పోరాట స్ఫూర్తితో పుట్టిన రూపమని హరీశ్​రావు అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఊరూరా విగ్రహాలు పెట్టుకుని పూజించుకున్న తల్లిని.. రేవంత్​మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆయన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి చరిత్ర హీనుడిగా మిగిలిపోయారని ఫైర్ అయ్యారు. రేవంత్​సృష్టించింది నకిలీ తెలంగాణ తల్లి అని, ఆ తల్లి చేతిలో నుంచి మన సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.