అసెంబ్లీలో కౌశిక్‌‌‌‌ దుమారం.. కడియంను తుపాకీతో కాల్చేస్తానంటూ బెదిరింపు సైగలు

అసెంబ్లీలో  కౌశిక్‌‌‌‌ దుమారం.. కడియంను తుపాకీతో కాల్చేస్తానంటూ బెదిరింపు సైగలు
  • తీవ్రంగా మండిపడ్డ మంత్రులు, కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేలు
  • పాడి సభ్యత్వాన్ని రద్దు చేయాలని మూకుమ్మడి డిమాండ్​
  • ఎథిక్స్​ కమిటీలో విచారణ జరిపించాలని స్పీకర్​ ఆదేశాలు
  • వెల్‌‌‌‌లో నిరసనకుగానూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ ఎమ్మెల్యేల సస్పెన్షన్​

హైదరాబాద్ , వెలుగు: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌‌‌‌రెడ్డి చేసిన సైగలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వైఖరిని కాంగ్రెస్‌‌‌‌ శాసనసభ్యులు తప్పు పట్టారు. సీనియర్‌‌‌‌‌‌‌‌ శాసనసభ సభ్యుడు  కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు.  ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు. మైనింగ్‌‌‌‌ అక్రమాలపై ఆదివారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కడియం శ్రీహరి లేచి గత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. బాలానగర్‌‌‌‌‌‌‌‌లో మాజీ మంత్రి హరీశ్‌‌‌‌ రావు భూదోపిడీ చేశారని  ఆరోపించారు.

ఈ సమయంలో పాడి కౌశిక్ రెడ్డి  బిగ్గరగా అరుస్తూ.. ‘ఇంతకీ నువ్వు ఏ పార్టీలో ఉన్నావ్?’  అంటూ కడియం శ్రీహరిని ప్రశ్నించారు. తుపాకీతో కాల్చి పారేస్తా అనేలా హావభావాలు ప్రదర్శించారని  అధికారపక్ష ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. కౌశిక్‌‌‌‌రెడ్డి వ్యవహారశైలిపై ఎథిక్స్​ కమిటీలో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మెజారిటీ సభ్యులు ఆమోదించారు. కాగా, సీనియర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి శాసనసభలో   కౌశిక్‌‌‌‌రెడ్డి అభ్యంతరకరమైన సంజ్ఞలు చేయడం, తుపాకీతో కాల్చేస్తానంటూ సైగలు చేయడాన్ని స్పీకర్​ తీవ్రంగా పరిగణించారు.

పాడి కౌశిక్‌రెడ్డిపై ఎథిక్స్​ కమిటీలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని  సభలో స్పీకర్‌‌ ఆదేశించారు. కౌశిక్‌రెడ్డి తీరు సభలోని కెమెరాల్లో రికార్డ్​ కావడంతో ఆయనపై నేరం రుజువయ్యే అవకాశాలున్నాయని ఎమ్మెల్యేలు అంటున్నారు. నేరం రుజువైతే ఆయన సభ్యత్వాన్ని స్పీకర్​ రద్దు చేసేందుకు అవకాశాలుంటాయి.

బీఆర్‌‌ఎస్​ సభ్యుల సస్పెన్షన్
సభను పదే పదే డిస్టర్బ్​ చేస్తుండడం.. క్రమశిక్షణతో ఉండకపోవడంతో బీఆర్‌‌ఎస్​ సభ్యులను స్పీకర్​ సస్పెండ్​ చేశారు. బడ్జెట్​ సమావేశాలు పూర్తయ్యే రెండు రోజుల వరకు వారిపై సమావేశాల్లో పాల్గొనకుండా వేటు వేశారు. ఆదివారం సభ ప్రారంభమైన వెంటనే బీఆర్‌‌ఎస్​ సభ్యులు హౌస్‌లో ఆందోళనకు దిగారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మైనింగ్​ వ్యవహారంపై హౌస్​ కమిటీ వేయాలని డిమాండ్​ చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లారు. అయితే, సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని, మాట్లాడేందుకు మైక్​ ఇస్తానని పదే పదే స్పీకర్​ చెప్పినా వినిపించుకోలేదు. పొద్దున్నుంచి మధ్యాహ్నం లంచ్​ బ్రేక్​ అయ్యే వరకు బీఆర్‌‌ఎస్​ సభ్యులు వెల్‌లో గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలోనే బీఆర్‌‌ఎస్​ ఎమ్మెల్యేలను సస్పెండ్​ చేసేందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి ఆమోదం లభించడంతో 24 మంది బీఆర్‌‌ఎస్​ ఎమ్మెల్యేలను స్పీకర్​ సస్పెండ్​ చేశారు.

ఇందులో బీఆర్‌‌ఎస్​ పార్టీ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్లు‌ హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, సబితా ఇంద్రారెడ్డి, పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్​, జగదీశ్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, మహిపాల్‌రెడ్డి, మాణిక్​ రావు, పద్మారావు, చింతా ప్రభాకర్​, కొత్త ప్రభాకర్​ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్​, విజేయుడు, కేపీ వివేకానంద్​, అనిల్​ జాదవ్​, కోవా లక్ష్మి, కల్వకుంట్ల సంజయ్​, పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి ఉన్నారు. అయితే, సస్పెండ్​ అయిన జాబితాలో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, సుధీర్‌‌రెడ్డి, ముఠా గోపాల్​ పేర్లు లేవు.