కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు ORR పై ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన డ్రైవర్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఇటీవల కేసీఆర్ నిర్వహించిన ఛలో నల్గొండ సభలో పాల్గొని తిరిగి వస్తుండగా.. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు హోంగార్డు మీద నుంచి వెళ్లడంతో.. అతను మృతి చెందాడు. ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడినా.. ఈరోజు జరిగిన కారు ప్రమాదంలో ఆమె  మరణించారు. దీంతో బీఆర్ఎస్ లో తీవ్ర విషాదం నెలకొంది. గతేడాది ఫిబ్రవరి నెలలోనే ఆమె తండ్రి, ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు.  కాగా, గత నవంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, గద్దర్ కూతురు వెన్నెలపై లాస్య నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.