సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే .. తోసేసిన రసమయి అనుచరులు

సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే .. తోసేసిన రసమయి అనుచరులు

హుజూరాబాద్/శంకరపట్నం,వెలుగు :  కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం ధర్మారంలో గ్రామ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన దళిత యువకులను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనుచరులు, బీఆర్ఎస్ ​పార్టీ లీడర్లు తోసేశారు. అంతటితో ఆగకుండా ఫోన్లు గుంజుకుని బూతులు తిట్టారు. బుధవారం గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగ్గా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రాన్ని ఇచ్చేందుకు గ్రామంలోని  కొందరు దళిత యువకులు ప్రయత్నించారు. సమస్యలను వివరిస్తామని ముందుకు వస్తుండడంతో బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే గన్​మెన్లు వారిని తోసేశారు. దీన్ని వీడియో తీసేందుకు ప్రయత్నించగా, వారి ఫోన్లు గుంజుకుని బూతులు తిట్టి వెళ్లగొట్టారు. బాధిత యువకులు మాట్లాడుతూ గతంలో ఊరి సమస్యలను సర్పంచ్​కు చెప్పినప్పుడు తాను ఎంపీని కాదని, ఎమ్మెల్యేను అంతకన్నా కాదని ఏమన్నా ఉంటే వారితోనే చెప్పుకోవాలని పంపించారన్నారు. 

దీంతో బుధవారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు సమస్యలు చెప్పుకుందామని వెళ్తే  గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఫోన్లు గుంజుకున్నారని, సతాయించి దాదాపు కొన్ని గంటల తర్వాత ఇచ్చారన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్ తమ ఊరును పట్టించుకోలేదని, ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. దళితులకు ఇండ్లు లేవని, ఒక్కరికి కూడా దళిత బంధు ఇవ్వలేదని, సీసీ రోడ్లు వేయలేదన్నారు.