డైలమాలో రేఖా నాయక్

డైలమాలో రేఖా నాయక్
  • ఖానాపూర్ కాంగ్రెస్ టికెట్ అడుగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • ఆదిలాబాద్ ఎంపీ, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆఫర్ ​చేస్తున్న కాంగ్రెస్
  • ఒకట్రెండు రోజుల్లో పార్టీ మార్పుపై క్లారిటీ

హైదరాబాద్, వెలుగు : పార్టీ మారే విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ డైలమాలో పడ్డారు. ఆ పార్టీలో ఉంటూనే ఆమె కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ టికెట్​కు అప్లై చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరే విషయంపై ఆమె.. కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఖానాపూర్ బీఆర్ఎస్ టికెట్ పొందిన జాన్సన్ నాయక్ క్రిస్టియన్ అని, ఎస్టీ కాదని రేఖా నాయక్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ టికెట్ తనదేనని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలతోనూ ఆమె చర్చలు కొనసాగిస్తున్నారు. ఖానాపూర్ టికెట్ ఇస్తే పార్టీలోకి వస్తానని ఆమె స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే, కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాత్రం ఆదిలాబాద్ ఎంపీ.. లేదంటే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. ఏదో ఒక స్థానాన్ని డిసైడ్ చేసుకోవాలని సూచించినట్టు చెప్తున్నారు. అయితే, ఆమె మాత్రం ఖానాపూర్ కోసం పట్టుబడుతున్నట్టు సమాచారం. 

అయితే, ఆసిఫాబాద్ నుంచి ఇప్పటికే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ అప్లై చేసుకున్నారు. ఆయన కూడా ఆ స్థానం నుంచి పోటీ చేయాలని గట్టిగానే డిసైడ్ అయ్యారు. రాజకీయ భవిష్యత్ కోసమే కాంగ్రెస్​లోకి వస్తున్నామని ఆయన చెప్తున్నారు. ఇద్దరం పోటీలో ఉండాలన్నదే తన ఆలోచన అని శ్యామ్ నాయక్​ చెప్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆమె డైలమాలో పడినట్టు తెలుస్తున్నది. మరోవైపు చర్చలు కొలిక్కి వస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలూ చెప్తున్నాయి. ఖానాపూర్ టికెట్ సాధ్యం కాదని ఆమెకు స్పష్టం చేసినట్టు తేల్చి చెప్పినట్టు సమాచారం. 

అతి త్వరలోనే ఆమె కాంగ్రెస్​లోకి వస్తారని స్పష్టం చేస్తున్నాయి. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. కాగా, రేఖా నాయక్ చేరికను ఖానాపూర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అసలు పార్టీలోనే చేరకుండా టికెట్​కు అప్లై చేసుకుంటే ఎలా ఆమోదిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆమెకు మాత్రం సహకరించేది లేదని తేల్చి చెప్తున్నారు.