అన్నం తినే చెయ్యికే సున్నం పెట్టాడు: రఘునందన్ రావు

అన్నం తినే  చెయ్యికే సున్నం పెట్టాడు: రఘునందన్ రావు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అయ్యప్ప మాలలో ఉండి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయన మాల తీసిన తర్వాత అంతకన్నా ఎక్కువ మాట్లాడుతానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే వ్యక్తిగా, మాలలో ఉన్న రోహిత్‌పై ఎక్కువ మాట్లాడటం కరెక్ట్‌ కాదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు సరైన సమాధానం చెప్పలేని రోహిత్, తనపై నిరాధారమైన, పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

తన ఆస్తులను బహిరంగంగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నానని, వాటిపై విచారణ జరపాలని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌‌ను కోరనున్నట్లు చెప్పారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రగతి భవన్ కంపౌండ్‌లో ఉండే వారు చెప్పిన చిలుక పలుకులనే రోహిత్‌ రెడ్డి ఇక్కడ పలుకుతున్నారని ఆరోపించారు. 2001 నుంచి తన ఆస్తులపై, సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ జరిపితే ఎవరు? ఏంటో? తెలుస్తుందన్నారు. 

తాను అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే, రాష్ట్రంలో మీ ప్రభుత్వమే కదా.. విచారణ జరిపి చర్యలు తీసుకోండని సవాల్‌ చేశారు. మీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాలంటే డ్రగ్స్ తీసుకున్నంతా ఈజీ కాదని ఎద్దేవా చేశారు. 

అసైన్డ్‌ భూములు అక్రమించి ఫామ్‌హౌస్‌ కట్టుకున్నవ్‌..

సర్ఫాన్ పల్లి ప్రాజెక్టు పరిధిలోని భూములపై విచారణ జరపాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌‌కి రోహిత్ లేఖ రాయాలని రఘునందన్ డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములను ఆక్రమించుకొని ఫామ్ హౌస్‌ కట్టిన విషయం నిజం కాదా..? అని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేసేందుకు సైట్ విజిట్‌కు వచ్చిన తహసిల్దార్‌‌ను అప్పటికప్పుడు బదిలీ చేయించింది వాస్తవం కాదా అని నిలదీశారు. 2018లో తాండూర్ ఎన్నికల ప్రచారంలో రోహిత్ మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. 

వాటికి సంబంధించిన వీడియోను రఘునందన్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ‘‘దొరలు తిరిగే కారు కావాలా.. అన్నం తినే చేయి కావాలా?’’అని ప్రచారం చేసిన రోహిత్.. ఇప్పుడు ఆ చెయ్యికే సున్నం పెట్టాడని విమర్శించారు. హోటల్స్ గురించి మాట్లాడిన రోహిత్.. పార్క్ హయత్, మారియట్ హోటళ్లల్లో మీ ఎమ్మెల్యేల బాగోతాలు తెలియనివి కాదన్నారు.