నాందేడ్​ మీటింగ్​ ఏర్పాట్లలో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు

నాందేడ్​ మీటింగ్​ ఏర్పాట్లలో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు
  • సీఎం రావడం లేదని తెలిసి దూరంగా మరికొందరు
  • రోజంతా పలుచగానే కనిపించిన సభ

హైదరాబాద్, వెలుగు: కోరం లేక అసెంబ్లీ శనివారం నిమిషం ఆలస్యంగా మొదలైంది. అసెంబ్లీ సమావేశం ప్రారంభం కావాలంటే మొత్తం సభ్యుల సంఖ్యలో పది శాతం అంటే 12 మంది విధిగా ఉండాలి. లేకుంటే సభను సమావేశపరచడం సాధ్యం కాదు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టేందుకు సభలో 12 మంది సభ్యులు కూడా లేకపోవడంతో అసెంబ్లీ సిబ్బంది లాంగ్ బెల్ మోగించారు. మంత్రుల చాంబర్ లో ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించి సభ ప్రారంభించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది నాందేడ్ సభ కోసం వెళ్లిపోవడంతో ట్రెజరీ బెంచీలన్నీ పలుచగానే కనిపించాయి. సభకు సీఎం కేసీఆర్ రావడం లేదని తెలుసుకొని మరికొందరు దూరంగా ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఉదయం 11 గంటలకు, ఆ తర్వాత సభలోకి వచ్చారు. రోజంతా అసెంబ్లీలో తక్కువ మంది సభ్యులే కనిపించింది. 

బడ్జెట్ సెషన్ 12 వరకే..

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం అసెంబ్లీ, మండలి బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని శనివారం ఉభయ సభల్లో ఆ నివేదికలు టేబుల్ చేశారు. మొత్తంగా అసెంబ్లీ బడ్జెట్ సెషన్​ను ఆరు రోజులకు, మండలి సమావేశాలను మూడు రోజులకు పరిమితం చేశారు. ఈ నెల 6న ఉదయం 10.30కి అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. 7న బడ్జెట్ అధ్యయనం కోసం ఉభయ సభలకు సెలవు ప్రకటించారు. 8న బడ్జెట్​పై సాధారణ చర్చ ఉంటుంది, ఉభయ సభల్లో హరీశ్​రావు రిప్లయ్​ ఇస్తారు. 9 నుంచి 11 వరకు మూడు రోజులు బడ్జెట్ పద్దులపై చర్చిస్తారు. 12న అప్రాప్రియేషన్ బిల్లుపై చర్చించి దానికి ఆమోదం తెలిపిన అనంతరం అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేయనున్నారు. మండలిలో 8న బడ్జెట్​పై జనరల్ డిస్కషన్, 12న అప్రాప్రియేషన్ బిల్లుపై చర్చిస్తారు. అప్రాప్రియేషన్​ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత మండలిని నిరవధికంగా వాయిదా వేయనున్నారు. కొత్త సెక్రటేరియెట్​ను ఈ నెల 17న ప్రారంభించాలని సీఎం ఇప్పటికే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రెండో శనివారం, ఆదివారం కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగించనున్నారు.