- బీఆర్ఎస్కు 352, బీజేపీకి 261 సీట్లు
- ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి జనం జేజేలు
మంచిర్యాల, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,505 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే, అందులో 892 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇందులో హస్తం మద్దతుదారులతోపాటు ఆ పార్టీ రెబెల్స్ కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు పట్టం కట్టారని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.
జిల్లాలో మెజార్టీ స్థానాల్లో హస్తం బలపర్చిన అభ్యర్థులు గెలువడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ సర్పంచుల ఆధ్వర్యంలో పల్లెలు మరింత ప్రగతి సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు 352 మంది విజయం సాధించగా, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 261 సీట్లు గెలుపొందారు.
మంచిర్యాల జిల్లాలో ఇలా..
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో వరుసగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేస్‌లలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మంచిర్యాల నియోజకవర్గంలో మొత్తం 61 జీపీలకు 58 చోట్ల ఎన్నికలు జరిగాయి. వీటిలో కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ ఆరు, బీజేపీ ఐదు సర్పంచ్సీట్లను గెల్చుకున్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో 114 జీపీలకు 113 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 88, బీఆర్ఎస్ 25 సీట్లలో విజయం సాధించారు. చెన్నూర్ నియోజకవర్గంలో 102 స్థానాలకు కాంగ్రెస్‌తోపాటు రెబెల్స్ కలిపి 83 సర్పంచ్స్థానాల్లో గెలుపొందారు.
బీఆర్ఎస్ 19 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక ఖానాపూర్నియోజకవర్గం పరిధిలోని జన్నారం మండలంలో 29 జీపీలకు కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 11, బీజేపీ నాలుగు చోట్ల గెలుపొందారు. బీసీ రిజర్వుడ్ సీట్లతోపాటు జనరల్ స్థానాల్లో అత్యధిక సంఖ్యలో బీసీలు సర్పంచ్‌లుగా గెలుపొందారు.
రూ.500 కోట్లు దాటిన ఖర్చు..
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల ఖర్చులపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. కానీ అభ్యర్థులు గెలుపే ధ్యేయంగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశారు. జిల్లాలో ఒక్కో గ్రామంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్లు కలిపి నలుగురు, ఐదుగురు పోటీపడ్డారు.
చిన్న పంచాయతీల్లో ఒక్కొక్కరు కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టారు. మేజర్ పంచాయతీలో రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఓటర్లకు రూ.500 నుంచి రూ.వెయ్యి, మేజర్ పంచాయతీల్లో అంతకంటే ఎక్కువే పంచి పెట్టారు. మందు, విందు అన్నీ కలిపితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ఖర్చు రూ.500 కోట్లు దాటినట్టు అంచనా వేస్తున్నారు.
అధికార యంత్రాంగం సక్సెస్..
ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం సక్సెస్ అయింది. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అంతరాయాలు లేకుండా నామినేషన్ల నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అంతా సాఫీగా సాగింది. మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ నేతృత్వంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది.
అలాగే రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, ముగ్గురు ఏసీపీల పర్యవేక్షణలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. నామినేషన్లు మొదలు పోలింగ్ పూర్తయ్యేంత వరకు భారీ బందోబస్తు నిర్వహించారు.
