న్యూఢిల్లీ: మార్కెట్ రెగ్యులేటరీ సెబీ మ్యూచువల్ ఫండ్ ఖర్చులను తగ్గించే కీలక నిర్ణయం తీసుకుంది. టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో (టీఈఆర్)ను ఇప్పుడు బేస్ ఎక్స్‌పెన్స్ రేషియో (బీఈఆర్)గా మార్చి, పెట్టుబడిదారులకు ఛార్జీల వివరాలను మరింత పారదర్శకంగా చూపించనుంది. మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఖర్చులు టీఈఆర్‌లో కలిసి ఉంటాయి.
కొత్త నియమాల ప్రకారం, ఖర్చులు 10–15 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ఉదాహరణకు, రూ.500 కోట్లలోపు ఆస్తులు ఉన్న ఓపెన్ -ఎండెడ్ ఈక్విటీ ఫండ్‌లలో గరిష్ట ఛార్జీ 2.25శాతం నుంచి 2.10శాతానికి తగ్గింది. డెట్ ఫండ్‌లలో దీనిని 1.85శాతానికి పరిమితం చేశారు. ఇండెక్స్ ఫండ్‌లు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు), ఫండ్ ఆఫ్ ఫండ్‌లలో కూడా ఖర్చులు దిగొచ్చాయి.
బీఈఆర్‌లో ఫండ్ నిర్వహణ ఫీజులు, డిస్ట్రిబ్యూటర్ కమీషన్లు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ (ఆర్‌టీఏ) ఛార్జీలు మాత్రమే ఉంటాయి. జీఎస్‌టీ, స్టాంప్ డ్యూటీ, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ), కమోడిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (సీటీటీ) వంటి చట్టబద్ధ ఖర్చులు వేరుగా కనిపిస్తాయి.
ఈ తగ్గింపు చిన్నదిగా కనిపించినా, దీర్ఘకాలంలో పెద్ద ప్రభావం చూపుతుందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఉదా. రూ.10 లక్షల పెట్టుబడిపై 20 సంవత్సరాల్లో 20బేసిస్ పాయింట్ల తగ్గింపు లభిస్తే రూ.2.95 లక్షలు ఆదా చేయొచ్చు.
