- సిద్దిపేట జిల్లాలో గులాబీ జోరుకు బ్రేకులు
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెతుకు సీమలో హస్తం పార్టీ హవా చూపింది. 1,603 పంచాయతీలకు ఎన్నికలు జరగగా మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు గెలుపొందారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పై చేయి సాధించగా, ఒక్క సిద్దిపేట జిల్లాలో మాత్రం గులాబీ పార్టీ మెరుగైన స్థానాలు దక్కించుకుంది. ఇక బీజేపీ రెండకెలకే పరిమితమైంది.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో మొత్తం 21 మండలాలు 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతు దారులే ఎక్కువ స్థానాల్లో సర్పంచ్‌లుగా గెలుపొందారు. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్మండలాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఎక్కువ మంది సర్పంచ్ లుగా గెలుపొందారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దశంకరంపేట మండలంలో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపూర్అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం బీఆర్ఎస్ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో కాంగ్రెస్‌పార్టీ బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చింది. ఇక జిల్లా వ్యాప్తంగా 17 సర్పంచ్ స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో గులాబీ జోరుకు కాంగ్రెస్ బ్రేకులు వేసింది. సిద్దిపేట నియోజకవర్గం మినహా జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ తో పాటు జనగామ. మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని మండలాల్లో కాంగ్రెస్ సత్తా చూపింది. జిల్లాలో మొత్తం 508 పంచాయతీలుండగా బీఆర్ఎస్ 251 గెలుచుకోగా కాంగ్రెస్ 177 పంచాయతీల్లో పాగా వేసింది. మొత్తం స్థానాల్లో కాంగ్రెస్ కంటే 74 స్థానాలను బీఆర్ఎస్ అధికంగా గెలుచుకుంది. జిల్లాను యూనిట్ గా పరిగణిస్తే దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల కంటే సిద్దిపేటలో బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకుంది.
గజ్వేల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి హరీశ్‌రావులు ప్రాతినిధ్యం వహిస్తున్నా మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన జోరును కొనసాగించింది. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకర్గం పరిధిలో కాంగ్రెస్ అత్యధికంగా 55 స్థానాలను గెలుచుకుంది. జనగామ నియోజకర్గం పరిధిలోని 4 మండలాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే అత్యధిక స్థానాలు గెలుచుకుంది. సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ 79 పంచాయతీలను గెలుచుకుంటే కాంగ్రెస్ 5 స్థానాలకే పరిమితమైంది.
జిల్లాలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. దుబ్బాక నియోజకవర్గంలో 11 పంచాయతీలను గెలుచుకున్నా మిగిలిన నియోజకవర్గాల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఈసారి ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం ఒక్కో సర్పంచ్ స్థానాన్ని గెలుచుకుంది. జిల్లాలో మొత్తం 55 మంది ఇండిపెండెంట్లు గెలిచారు.
సంగారెడ్డిలో జిల్లాలో..
పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పైచేయి సాధించింది. సంగారెడ్డి, జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ బలపరిచిన క్యాండిడేట్లు కాంగ్రెస్ ముందు ఎదురీదక తప్పలేదు. అందోల్, నారాయణఖేడ్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ మద్దతుదారులకు బీఆర్ఎస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పటాన్ చెరు నియోజకవర్గంలో జరిగిన 11 పంచాయతీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 613 పంచాయతీలకు కాంగ్రెస్ 374, బీఆర్ఎస్ 185 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ కేవలం11 స్థానాలతో సరిపెట్టుకుంది.
ఇండిపెండెంట్లు 32 స్థానాల్లో పాగా వేసినప్పటికీ అందులో 22 మంది స్వతంత్ర సర్పంచులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని కంది, కొండాపూర్, సదాశివపేట, జహీరాబాద్, ఝరాసంగం మండలాల్లో మాత్రమే ఆ పార్టీ కాస్త పర్వాలేదనిపించింది. మిగతా చోట్ల ఎక్కడ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పోటీ ఇవ్వలేకపోయింది. జిల్లాలో 565 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 48 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
