- రోప్‌లు మార్చేందుకు ప్రపోజల్స్
- రిపేర్లకు నాలుగు నెలలే టైమ్
- పనులు స్పీడప్ చేయడంపై ఆఫీసర్ల నజర్
గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టు రిపేర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రిపేర్లకు ఈ నాలుగు నెలలే అనువుగా ఉండడంతో పనులు స్పీడప్ చేసేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. పనులు స్టార్ట్ అయినప్పటికీ, స్లోగా జరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నాలుగేళ్ల కింద రిపేర్ పనులు స్టార్ట్ చేసినప్పటికీ 30 మాత్రమే కంప్లీట్ అయ్యాయి.
గత సర్కార్ అంతులేని నిర్లక్ష్యం..
జూరాల ప్రాజెక్టు గేట్ల రిపేర్లను గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. జూరాల ప్రాజెక్టులో 8 గేట్ల రోప్ డ్యామేజీ ఉన్నట్లు గుర్తించారు. 12 గేట్ల నుంచి నీరు లీకేజీ అవుతోందని, నాలుగు గేట్ల నుంచి ఎక్కువగా నీరు లీకేజీ అవుతుందని గుర్తించారు. వీటికి వెంటనే రిపేర్లు చేయాలని 2020లో గుర్తించగా, 2021లో టెండర్లు పిలిచారు. టెండర్లు దక్కించుకున్న స్వప్న కన్స్ట్రక్షన్ కంపెనీ రిపేర్లుస్టార్ట్ చేసినప్పటికీ, ఇప్పటివరకు 30 శాతం పనులు మాత్రమే కంప్లీట్ అయ్యాయి. 64 గేట్లలో 18 గేట్లకు ఇనుప రోప్‌లు, రబ్బర్ సీల్స్ తో పాటు మెయింటెనెన్స్ పనులు చేయాల్సి ఉంది.
పనులు పూర్తి కాకపోవడంతో గేట్ల నుంచి లీకేజీ కొనసాగుతోంది. ఆరు నెలల్లో పనులు కంప్లీట్ చేసేలా సదరు కంపెనీ ఒప్పందం చేసుకున్నప్పటికీ, అప్పటి ఆఫీసర్ల నిర్లక్ష్యంతో నామమాత్రపు పనులు చేసి, గేట్ల లీకేజీ, ఇనుప రోప్ లు, రబ్బర్ సీల్స్ వేసే పనులను పక్కన పెట్టారని అంటున్నారు.
పనులు స్పీడప్ చేసేందుకు చర్యలు..
జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన 18 గేట్లకు రిపేర్లు చేయాలని ఆఫీసర్లు గుర్తించారు. 8 గేట్లకు రోప్ ముప్పు ఉందని గుర్తించి పనులు స్టార్ట్ చేశారు. 2009లో జూరాల ప్రాజెక్టుకు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. అలాంటి వరదలు మళ్లీ వస్తే ప్రాజెక్టు గేట్లు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. జూరాలకు ఈ ఏడాది 5 లక్షల కంటే తక్కువ వరద రావడంతో ఎలాంటి ఇబ్బంది రాలేదని అంటున్నారు. ఈక్రమంలో జూరాల ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముఖ్యమైన పనులు పూర్తి చేయడంపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు.
రెండు షిఫ్టుల్లో పనులు కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కాంటాక్టర్‌కు సూచించారు. అలాగే ప్రాజెక్ట్‌కు సంబంధించిన 64 గేట్ల రోప్‌లు మార్చేందుకు రూ.4.20 కోట్లతో ఎస్టిమేషన్లు రెడీ చేసి ప్రభుత్వానికి పంపించారు. అక్కడి నుంచి అప్రూవల్ రాగానే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని భావిస్తున్నారు.
రిపేర్లపై దృష్టి పెడుతున్నాం..
జూరాల ప్రాజెక్టు గేట్ల రిపేర్లపై దృష్టి పెడుతున్నాం. ఇప్పటికే కాంట్రాక్టర్ తో మాట్లాడి రిపేర్లను స్పీడప్ చేయాలని, రెండు షిఫ్ట్ లలో పనులు జరిగేలా చూడాలని సూచించాం. ప్రాజెక్ట్ పనులకు సంబంధించిన మరిన్ని ప్రపోజల్స్ గవర్నమెంట్‌కు పంపించాం. ఈ నాలుగు నెలల్లో పనులు ఓ కొలిక్కి వచ్చేలా చూస్తాం.- రహీముద్దీన్, ఎస్ఈ, జూరాల ప్రాజెక్ట్
