డిసెంబర్ 22 నుంచి కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్

డిసెంబర్  22 నుంచి కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్

 

  • హెచ్‌సీఏతో కలిసి నిర్వహించనున్న విశాక ఇండస్ట్రీస్‌
  • టోర్నీని ప్రకటించి, జెర్సీలు ఆవిష్కరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
  • గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు పట్టం కట్టేలా ఇంటర్​ డిస్ట్రిక్ట్​ టీ20 లీగ్
  • జనవరి 17 వరకు రెండు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా 104 మ్యాచ్‌లు
  • మొత్తంగా 500 పైచిలుకు ఆటగాళ్లకు అవకాశం

హైదరాబాద్‌, వెలుగు:గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయడానికి విశాక ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)తో కలిసి ఈ నెల 22 నుంచి జనవరి 17 వరకు ‘కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20’ లీగ్‌ నిర్వహించనున్నట్లు విశాక ఇండస్ట్రీస్ చైర్మన్, మంత్రి వివేక్​ వెంకటస్వామి ప్రకటించారు. రెండు దశల్లో ఈ లీగ్  జరుగనుంది. జట్ల జెర్సీలను మంత్రి వివేక్‌  ఆవిష్కరించారు. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లు, జిల్లా సంఘాల సెక్రటరీలతో కలిసి టోర్నీ షెడ్యూల్‌, వివరాలను  ఆయన వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెటర్లను ప్రోత్సహించడంలో విశాక ఇండస్ట్రీస్​ ఎప్పుడూ ముందుంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. 

‘‘మన పల్లెల్లో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. వారికి అవకాశం ఇస్తూ జిల్లాల్లో క్రికెట్‌‌ అభివృద్ధికి సపోర్ట్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెటర్లకు టర్ఫ్‌‌ వికెట్లు సహా అవసరమైన సదుపాయాలు కల్పిస్తే.. ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారు.  నేను హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌గా ఉన్నప్పుడు నిర్వహించిన టీ20 లీగ్‌‌లో జిల్లా క్రికెటర్లు తమ టాలెంట్‌‌ను నిరూపించుకున్నారు. నాటి టోర్నీలో అందరూ హైదరాబాద్ టీమ్‌‌ గెలుస్తుందని అనుకుంటే ఆదిలాబాద్‌‌ జట్టు గెలిచి ఆశ్చర్యపరిచింది. 

ఆ తర్వాత వీ6 వెలుగు క్రికెట్‌‌ టోర్నమెంట్ అన్ని జిల్లాల జట్లతో సక్సెస్‌‌ ఫుల్‌‌గా నిర్వహించాం. ఆ మధ్య పెద్దపల్లి పార్లమెంట్‌‌ పరిధిలోనూ లీగ్ నిర్వహిస్తే..  అక్కడ చాలా మంది ఇలాంటి టోర్నీని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పారు. అదే సమయంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్‌‌ కోసం స్పాన్సర్‌‌‌‌ షిప్ ఆహ్వానిస్తూ హెచ్‌‌సీఏ చేసిన ప్రకటన చూసి విశాక బిడ్‌‌లో పాల్గొని స్పాన్సర్‌‌‌‌షిప్‌‌ హక్కులు సొంతం చేసుకుంది. ఈ టోర్నీకి విశాక స్పాన్సర్‌‌‌‌గా ఉండటం సంతోషకరమైన విషయం. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెటర్లకు ఓ సువర్ణావకాశంగా మారుతుందని ఆశిస్తున్నా. నేను ఇక్కడికి రాష్ట్ర మంత్రిగా రాలేదు. విశాక ఇండస్ట్రీస్​ చైర్మన్‌‌గా వచ్చాను. ఈ టోర్నీలో ప్రభుత్వం ఇన్వాల్వ్‌‌ అవ్వడం లేదు. హెచ్‌‌సీఏతో కలిసి ఏకైక స్పాన్సర్‌‌‌‌గా విశాకనే లీగ్‌‌ బాధ్యతలు చూస్తుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే మ్యాచ్‌‌లు లైవ్‌‌ స్ట్రీమ్‌‌ అవడం మరింత సంతోషకర విషయం. ఈ టోర్నీలో ఆడే క్రికెటర్ల ఆటను హెచ్‌‌సీఏ సెలెక్టర్లు చూస్తారు. బాగా ఆడిన వారికి హెచ్‌‌సీఏ టీమ్స్‌‌ తరఫున అవకాశం కల్పిస్తారు’’ అని ఆయన వివరించారు. 

హెచ్‌‌సీఏ ముందుకొస్తే విమెన్స్‌‌ టోర్నీ కూడా

ప్రస్తుతం అన్ని జిల్లాలకు అవకాశం వచ్చేలా మెన్స్ టీమ్స్‌‌తో లీగ్ జరుగుతుందని.. హెచ్‌‌సీఏ ముందుకొస్తే  విమెన్స్‌‌ కోసం ప్రత్యేక టోర్నీకి కూడా స్పాన్సర్​షిప్​ ఇచ్చేందుకు విశాక సిద్ధంగా ఉందని మంత్రి వివేక్​ ప్రకటించారు. అమ్మాయిలకు కూడా అవకాశాలు రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. హెచ్‌‌సీఏ కోరుకుంటే కాకా మెమోరియల్ టోర్నీని ఏటా స్పాన్సర్‌‌‌‌ చేస్తామని ఆయన చెప్పారు. క్రికెట్‌‌ను ఎంతగానో ఇష్టపడే తన తండ్రి కాకా వెంకటస్వామి వల్లనే తమ ఫ్యామిలీ మెంబర్స్‌‌కు ఆటపై ఆసక్తి ఏర్పడిందన్నారు. ‘‘కాకా చొరవ వల్లనే  బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌‌, ఆర్థిక శాఖ మంత్రి చిదంబరంతో మాట్లాడి బోర్డుకు పన్ను మినహాయింపు లభించడంలో కాకా కీలక పాత్ర పోషించారు’’ అని మంత్రి పేర్కొన్నారు. 

కాకా ముందుచూపుతోనే ఉప్పల్ స్టేడియం 

కాకా వెంకటస్వామి ముందుచూపుతోనే హెచ్‌‌సీఏకు ఉప్పల్‌‌లో అద్భుతమైన స్టేడియం ఏర్పాటైం దని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్‌‌ శివలాల్ యాదవ్ అన్నా రు. క్రికెట్‌‌ను కాకా ఎంతగానో ప్రమోట్ చేశారన్నారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీకి విశాక తరఫున స్పాన్సర్‌‌‌‌షిప్ ఇచ్చిన వివేక్‌‌కు హెచ్‌‌సీఏ తాత్కాలిక ప్రెసిడెంట్‌‌ దల్జీత్‌‌ సింగ్‌‌, జాయింట్ సెక్రటరీ బసవరాజు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎస్‌‌జీఎంలో కొత్త జిల్లాలకు హెచ్‌‌సీఏ సభ్యత్వం ఇచ్చే విషయాన్ని చర్చిస్తామ ని తెలిపారు. కాగా, 2018లో వివేక్​ హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌గా ఉన్న సమయంలో  కాకా వెంకటస్వామి తెలం గాణ టీ20 నిర్వహించి టీమిండియా స్టార్ తిలక్ వర్మ వంటి ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా దాదాపు 500 పైచిలుకు గ్రామీణ క్రీడాకారుల కోసం టోర్నీ నిర్వహిస్తున్నారు. రెండు దశల్లో కలిపి మొత్తం 104 మ్యాచ్​లు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్​లకు  లైవ్​ స్ట్రీమ్​ కూడా ఉంటుంది. 

విన్నర్‌‌‌‌కు రూ. 5 లక్షలు

టోర్నీలో ఓవరాల్ విన్నర్‌‌‌‌గా నిలిచే జట్టుకు రూ. 5 లక్షల ప్రైజ్‌‌మనీని విశాక ఇండస్ట్రీస్‌‌ ఇవ్వనుంది. రన్నరప్ టీమ్ రూ. 3 లక్షలు దక్కించుకోనుండగా.. మూడో స్థానానికి రూ. 2 లక్షలు, నాలుగో స్థానికి రూ. లక్ష నగదు లభిస్తుంది. ప్లేయర్‌‌‌‌ ఆఫ్ ద టోర్నమెంట్‌‌గా నిలిచే ఆటగాడికి రూ. 20 వేల నగదు, బెస్ట్ బౌలర్‌‌‌‌, ఫీల్డర్,  బ్యాటర్‌‌‌‌, ఆల్‌‌రౌండర్‌‌‌‌గా ఎంపికయ్యే వారికి తలో రూ. 10 వేల చొప్పున నగదు పురస్కారం ఇస్తారు. తొలి దశలో ప్రతి మ్యాచ్‌‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌కు రూ. 2 వేలు, రెండో దశలో  ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌కు రూ. 5 వేల చొప్పున ప్రైజ్‌‌మనీ లభిస్తుంది. 

ఫార్మాట్‌‌, షెడ్యూల్ ఇలా..
    
ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగే తొలి ఫేజ్‌‌లో  హైదరాబాద్‌‌, రంగారెడ్డి మినహా 29 జిల్లాల జట్లు 55 మ్యాచ్‌‌లు ఆడతాయని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మహబూబ్‌‌ నగర్ జిల్లా క్రికెట్ గ్రౌండ్ సంఘం గ్రౌండ్‌‌లో  పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఓపెనింగ్ సెర్మనీ, మొదటి మ్యాచ్‌‌ ఉంటాయని చెప్పారు. ఈ దశలో అన్ని మ్యాచ్‌‌లు ఆయా జిల్లా కేంద్రాల్లోని టర్ఫ్ వికెట్లపై జరుగుతాయని చెప్పారు. తొలి దశలో  29 జట్లను (కొత్త జిల్లాలు) 8 జోన్లుగా (ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌‌నగర్, మెదక్) విభజించి రౌండ్ రాబిన్, ఫైనల్ ఫార్మాట్‌‌లో పోటీలు నిర్వహిస్తారు. ప్రతి జట్టులో 15 మంది ప్లేయర్లు ఉంటారు. జోనల్ చాంపియన్‌‌ (ఉమ్మడి జిల్లా)గా నిలిచిన ఎనిమిది జట్లు రెండో దశకు అర్హత సాధిస్తాయి.
    
ఈ నెల 29 నుంచి జనవరి17 వరకు జరిగే రెండో దశలో.. ఉమ్మడి 8 జిల్లాల జట్లకు తోడు హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాలను కూడా చేర్చి 10 టీమ్స్‌‌తో 49 మ్యాచ్‌‌లు నిర్వహిస్తారు. ప్రతి జట్టులో 18 మంది క్రికెటర్లు ఉంటారు. ఈ ఫేజ్‌‌లో 9 రౌండ్ల మ్యాచ్‌‌ల తర్వాత టాప్‌‌–4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌‌కు అర్హత సాధిస్తాయి. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 29న ఓపెనింగ్‌‌ సెర్మనీ, జనవరి 17న ఫైనల్ నిర్వహిస్తారు.