యూపీలో దారుణం
ముస్లిం అమ్మాయితో పెండ్లి.. కుటుంబంలో గొడవలే కారణం
జౌన్పూర్: ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య కోసం ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. వారి మృతదేహాలను ముక్కలుగా కోసి నదిలో పడేశాడు. భార్యాభర్తలైన శ్యామ్ బహదూర్ (62), బబిత (60) జౌన్ పూర్ లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు అంబేశ్ ఉన్నారు.
ఐదేండ్ల క్రితం అంబేశ్ ఓ ముస్లిం అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. శ్యామ్, బబిత ఆమెను కోడలిగా అంగీకరించలేకపోయారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంటికి రానివ్వలేదు. దీనిపై తరచుగా గొడవలు జరిగేవి. దీంతో అంబేశ్ దంపతులు విడిపోవడానికి ఒప్పుకున్నారు. అయితే, భార్య ఐదు లక్షలు భరణం అడిగింది. అతడి దగ్గర అంత డబ్బు లేకపోవడంతో విడాకుల కోసం డబ్బులు కావాలని తల్లిదండ్రులను అడిగాడు. వారు ఒప్పుకోలేదు.
దీంతో అంబేశ్ ఆగ్రహానికి గురై డిసెంబర్ 8న రుబ్బు రోలుతో కొట్టి తల్లిదండ్రులను చంపేశాడు. అనంతరం తల్లిదండ్రుల మృతదేహాలను రంపంతో ఆరు ముక్కలుగా కోసి సంచిలో వేశాడు. 9వ తేదీ తెల్లవారుజామున వాటిని తీసుకెళ్లి దగ్గరలోని నదిలో పడేశాడు. ఈ క్రమంలోనే తన సోదరి వందనకు ఫోన్ చేసి.. తల్లిదండ్రులు గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయారని చెప్పాడు. కానీ, తర్వాత తోబుట్టువులతో పాటు స్థానికులు అనుమానంతో పోలీసులను పిలిపించారు. చివరకు తానే హత్య చేసినట్టు అతడు విచారణలో ఒప్పుకున్నాడు.
