- మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్
- హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని నిరసన
- పేపర్లు చింపి విసిరేసిన కేటీఆర్, కేపీ వివేకానంద, కొత్త ప్రభాకర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: మైనింగ్ శాఖలో అక్రమాల ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని వారు పట్టుబట్టారు. ఆదివారం అసెంబ్లీలో సభ ప్రారంభం కాగానే ప్లకార్డులతో నినాదాలు చేశారు. అంతకుముందు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవిందనాయక్ మృతికి సభ సంతాపం తెలిపి సభ నివాళులు అర్పించింది. మంత్రులు వారించినా నిరసనను విరమించకుండా స్పీకర్ పోడియం ముందుకు వచ్చి కూర్చుని నినాదాలు చేశారు.
కొంతసేపటి తర్వాత ఎమ్మెల్యేలు కేటీఆర్, కేపీ వివేకానంద గౌడ్, కొత్త ప్రభాకర్ రెడ్డి కాగితాలు చింపి సభలో విసిరేయడం ఉద్రిక్తతకు దారితీసింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా మార్షల్స్ అడ్డుకున్నారు. తమ స్థానాల్లో కూర్చుంటే మాట్లాడే అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పినా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వినిపించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత ఎమ్మెల్యేలు కేటీఆర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ పేపర్లు చింపి విసిరేశారు.
బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ సభ్యులు అడుగుతున్నట్లు హౌస్ కమిటీ ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటేపల్లి వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. “ముందు మాకు సూచనలు ఇవ్వడం కాదు.. మీరేం చేశారో చెప్పండి? కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ ఏమైంది... కేంద్రంలో అధికారంలో ఉంది మీరే కదా.. ఎక్కడి వరకూ వచ్చింది. ముందు స్పష్టత ఇవ్వండి. మీరు ముందు పాటించి... తర్వాత మాకు సూచనలు, సలహాలు ఇవ్వండి” అని శ్రీధర్ బాబు సూచించారు.
గత ప్రభుత్వంలో హౌస్ కమిటీల సమావేశాలు జరిగిందీ లేదు..
గత టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో(2014 నుంచి 2018) మూడు హౌజ్ కమిటీలు (హౌజ్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సెల్ ఆక్యుపేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, హౌజ్ కమిటీ ఆన్ ఎంక్వైరీ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్, హౌజ్ కమిటీ ఆన్ ఇరెగ్యులారిటీస్ ఇన్ హౌజింగ్ కో ఆపరేటివ్ సొసైటీస్) వేశారని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. కానీ... ఎప్పుడూ సమావేశాలు జరిగిందీ లేదని, రిపోర్ట్స్ ఇచ్చిందీ లేదన్నారు.
ఈ హౌజ్ కమిటీల రిపోర్ట్స్ ని ఎందుకు బయట పెట్టలేదో బీఆర్ఎస్ సభ్యులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “ హౌజ్ కమిటీ కూడా సీబీసీఐడీతో విచారణ చేయించాలనే సిఫార్సు చేస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హౌజ్‌లో సీబీసీఐడీతో విచారణ చేయిస్తామని అనౌన్స్ చేశారు. అయినా... ఎందుకు హౌజ్ కమిటీ కోసం పట్టు పడుతున్నారో బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. పదేళ్ల మీ ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాలను వెలికి తీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని మంత్రి తెలిపారు.
సీబీ సీఐడీ విచారణ చేయిస్తామన్నా సభను అడ్డుకుంటారా : శ్రీధర్ బాబు
సభా నిర్వహణలో స్పీకర్‌కు సహకరించాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉంటుందని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన అంశాలపై విచారణ చేయిస్తామని మంత్రి వివేక్ వెంకట స్వామి ఇప్పటికే హౌజ్ లో అనౌన్స్ చేశారని, అయినా సభలో రాద్ధాంతం చేయడం తగదని సూచించారు. “సీబీసీఐడీతో విచారణ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హౌజ్‌లో అనౌన్స్ చేశారు. హౌజ్ కమిటీ కోసం సభను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం? ఒకవేళ మీ దగ్గర ఉన్న ఆధారాలను విచారణ సమయంలో సీబీసీఐడీ అధికారులకు ఇవ్వండి.
అంతేగానీ.. ముఖ్యమైన చర్చ జరిగే సమయంలో సభను అడ్డుకోవడం సరికాదు. సభా కార్యకలాపా లను అడ్డుకోవడమే బీఆర్ఎస్ సభ్యుల అజెండాగా కనిపిస్తోంది. 2014 నుంచి జరిగిన మైనింగ్ అక్రమాలపై విచారణ చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ సభ్యులకు సీబీసీఐడీపై నమ్మకం లేకపోతే మేమేం చేయాలని మంత్రి ప్రశ్నించారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవద్దని ప్రభుత్వం తరఫున అనేక సార్లు విజ్ఞప్తి కూడా చేశామన్నారు.
