- వీరిపై ఫిర్యాదు చేసిన కేపీ వివేకానంద, జగదీశ్ రెడ్డి కూడా హాజరు
- నేడు స్పీకర్ ముందుకు రానున్న పోచారం, అరికపూడి
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, డా.సంజయ్ గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ ఇద్దరిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ కూడా అసెంబ్లీకి చేరుకొని స్పీకర్ ఎదుట హాజరయ్యారు. ఇరువర్గాల ఎమ్మెల్యేలు తమ అడ్వకేట్లను వెంటబెట్టుకొని స్పీకర్ ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఇరువర్గాల వాదనలను స్పీకర్ విన్నారు. కాంగ్రెస్ లో చేరినట్లు తమపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ తమ రాజకీయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని స్పీకర్ ఎదుట తెల్లం వెంకట్రావ్, సంజయ్ వాదనలు వినిపించినట్లు సమాచారం.
తాము ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని, పలు ఆధారాలను స్పీకర్ ముందుంచినట్లు తెలిసింది. తెల్లం వెంకట్రావ్, సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాల్సిందేనని, పలు ఆధారాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద స్పీకర్ ముందు ఉంచినట్లు తెలిసింది. ఈ నెల 12న ఇరువర్గాల ఎమ్మెల్యేలను స్పీకర్ మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస రెడ్డి, అరెకపూడి గాంధీ శుక్రవారం స్పీకర్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
