హైదరాబాద్, వెలుగు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నదని, మంత్రిని బర్తరఫ్ చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరారు. సోమవారం కేటీఆర్, హరీశ్ రావుల నేతృత్వంలో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
సంబంధం లేని భూములను ఆక్రమించి, మినరల్ డీలర్ లైసెన్స్, పొల్యూషన్ బోర్డు అనుమతులు, విద్యుత్ కనెక్షన్లు, పరిశ్రమల శాఖ అనుమతులు లేకుండానే రెండేళ్లుగా వందల కోట్ల ప్రజా సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. సీఎం సీబీసీఐడీ ఎంక్వైరీ చేయిస్తామన్నారని, హోంశాఖ అధికారులతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఒక సభా సంఘం ఏర్పాటు చేయాలని, ఇండిపెండెంట్ జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణకు ఆదేశించాలని గవర్నర్ను కోరారు. మంత్రి హోదాలో ఉన్నందున విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఆయన్ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై నిరసన తెలిపినందుకు బీఆర్‌ఎస్ నేతలను సభ నుంచి సస్పెండ్ చేశారని గవర్నర్‌కు వివరించారు.
