బీఆర్ఎస్‌‌‌‌కు కసిరెడ్డి రాజీనామా.. కాంగ్రెస్‌‌లో చేరుతున్నట్టు ప్రకటన

బీఆర్ఎస్‌‌‌‌కు  కసిరెడ్డి రాజీనామా.. కాంగ్రెస్‌‌లో చేరుతున్నట్టు ప్రకటన
  • సీఎం కేసీఆర్‌‌‌‌కు తన రాజీనామా లేఖ
  • పీసీసీ చీఫ్ రేవంత్‌‌తో కసిరెడ్డి నారాయణ రెడ్డి సమావేశం

హైదరాబాద్, వెలుగు:  బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆదివారం ఈమేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌‌‌‌కు పంపించా రు. ‘‘ప్రజల ఆకాంక్షలు నెరువేరుతాయన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని నాడు సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు గడిచినా ఆ లక్ష్యాలు మాత్రం నెరవేరలేదు. ఇటీవల తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో ప్రజల సంక్షేమం కోసం 6 గ్యారంటీలను సోనియా ప్రకటించారు. వాటితో తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందన్న నమ్మకం కలిగింది. పేద ప్రజలకూ న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా. అందుకే సోనియా గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్​లో చేరాలని నిర్ణయించుకున్నా. బీఆర్ఎస్ పార్టీలో నాకు అవకాశాలు ఇచ్చినందుకు థ్యాంక్స్. పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’’ అని లేఖలో కసిరెడ్డి నారాయణ రెడ్డి పేర్కొన్నారు.

గంటపాటు రేవంత్‌‌తో చర్చలు 

కసిరెడ్డితో పాటు కల్వకుర్తి జెడ్పీ వైస్​చైర్​పర్సన్ బాలాజీ సింగ్ కూడా బీఆర్ఎస్‌‌కు రాజీనామా చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ ఇంటికి బాలాజీ సింగ్‌‌తో కలిసి కసిరెడ్డి నారాయణరెడ్డి వెళ్లారు. దాదాపు గంటసేపు రేవంత్​తో చర్చలు జరిపారు. బీఆర్ఎస్ నుంచి కల్వకుర్తి టికెట్ ఆశించిన కసిరెడ్డి.. టికెట్ దక్కకపోవడంతో  కొద్ది రోజులగా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కసిరెడ్డిని మంత్రి కేటీఆర్, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కల్వకుర్తి టికెట్ హామీతోనే కసిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని తెలుస్తున్నది. రేవంత్​తో భేటీలో సంపత్ కుమార్, మల్లు రవి తదితర నేతలు ఉన్నారు.