బెయిల్ ఇవ్వలేం.. సుప్రీంకోర్టులో కవితకు బిగ్ షాక్

బెయిల్ ఇవ్వలేం..  సుప్రీంకోర్టులో కవితకు బిగ్ షాక్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది.  బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది.  బెయిల్ తాము ఇవ్వలేమని, ఎవరైనా క్రింది కోర్టును మొదట ఆశ్రయించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.  లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మార్చి 22వ తేదీ శుక్రవారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టును ఆశ్రయించే అంత ఆర్ధిక స్థోమత ఉన్నంత మాత్రన... మీ పిటషన్‌ను పరిగణనలోకి తీసుకోలేమని  జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.  

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనని తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేస్తున్నాయని కవిత తరపు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఒకసారి సాక్షిగా మరోసారి నిందితురాలిగా పిలిచారని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేదని, అప్రూవర్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు సాగుతోందని సిబల్‌ పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం ప్రస్తుతం తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది.  పిటిషన్‌లో రాజ్యాంగ పరమైన విషయాలను లేవనెత్తారని, వాటిపై మిగతా పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న ధర్మాసనం పేర్కొంది.  కేసు మెరిట్స్‌ గురించి ట్రయల్‌ కోర్టుకే చెప్పాలని ధర్మాసనం సూచించింది.  బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టును ఆశ్రయించే స్వేచ్చ పిటిషనర్‌కు ఉందంది ధర్మాసనం.  మహిళ కాబట్టి త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్‌ కోర్టుకు ధర్మాసనం సూచించింది.   రాజ్యాంగ పరమైన అంశాలపై ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని,  తర్వాత మరో రెండు వారాల్లో రిజాయిండర్‌ దాఖలు చేయాలని ఈడీని  ఆదేశించింది.