కవిత రూటే సెపరేట్?..బీఆర్ఎస్తో సమాంతరంగా ప్రోగ్రామ్స్

కవిత రూటే సెపరేట్?..బీఆర్ఎస్తో సమాంతరంగా ప్రోగ్రామ్స్
  • బీఆర్ఎస్ తో సమాంతరంగా ప్రోగ్రామ్స్
  • మొన్న మేడిగడ్డ సందర్శనకు దూరం
  •  నిన్న ఎల్ ఆర్ఎస్ ధర్నాలో పాల్గొనలే
  • రేపు బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా ఇందిరాపార్క్ వద్ద ఆందోళన

హైదరాబాద్: కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు సమాంతరశక్తిగా జాగృతిని తీర్చిదిద్దుతున్నారా? తన సొంత సంస్థ ఎదుగుదలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా? అనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఇచ్చిన రెండు పెద్ద కార్యక్రమాలకు ఆమె హాజరు కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విమర్శలు వస్తున్న తరుణంలో బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, ఇతర ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంకు కవిత వెళ్లలేదు. ఎమ్మెల్సీగా మండలిలో తన వాణి వినిపిస్తున్న కవిత డ్యాం పరిశీలనకు ఎందుకు వెళ్లలేదన్న చర్చ సాగింది. 

ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న(బుధవారం) బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించింది.  సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనల్లో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కవిత కనిపించలేదు. ఇదే సమయంలో చిన జీయర్ స్వామితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు కేటీఆర్ పిలుపునిస్తే.. కవిత ఆలయ సందర్శనకు వెళ్లడం చిన జీయర్ తో భేటీ కావడంపై సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. 

ALSO READ :- డైలీ సీరియల్ లా లిక్కర్ కేసు: ఎమ్మెల్సీ కవిత

దీనిపై ఇవాళ మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో తాను గుడికి వెళ్లానని అందుకే ఆందోళనల్లో పాల్గొనలేదని చెప్పడం గమనార్హం. అయితే జీవో నంబర్ 3కు వ్యతిరేకంగా రేపు భారత జాగృతి ధర్నా నిర్వహించనుంది. బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా ఈ ఆందోళనను నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలం తన సంస్థ వేదికగా వేరే కార్యక్రమాలు నిర్వహిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కూడా భారత జాగృతి ఆధ్వర్యంలోనే చేపట్టారు.  ఇందులో బీఆర్ఎస్, సీపీఐ,సీపీఎం నాయకులు పాల్గొన్నప్పటికీ కార్యక్రమం మాత్రం భారత జాగృతి ఆధ్వర్యంలోనే సాగింది. ప్రస్తుతం కవిత అనుసరిస్తున్న ధోరణిలో ఏదో తేడా ఉందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.