- ఈడీ, సీబీఐ సేకరించిన ఆధారాలను తోసిపుచ్చలేం
- మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వలేం
- స్కామ్‌లో కవితనే కింగ్‌పిన్ అని దర్యాప్తు సంస్థలు చెప్తున్నయ్
- సాక్ష్యాలను ఆమె చెరిపేసినట్లు అనుమానాలున్నాయని కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులోనూ బెయిల్ దొరకలేదు. బెయిల్‌పై సానుకూల తీర్పు వస్తుందని దాదాపు నెల రోజులుగా ఎదురుచూస్తున్న ఆమెకు నిరాశే మిగిలింది. కేవలం మహిళ అనే కారణంతో సానుభూతి చూపుతూ బెయిల్ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈడీ సమన్లు ఇచ్చిన తర్వాతే కవిత ఫోన్లు ఫార్మెట్ అయినట్లు, సాక్ష్యాలను ఆమె చెరిపేసినట్టు అనుమానాలు ఉన్నాయని అభిప్రాయపడింది. మనీలాండరింగ్ కు సంబంధించి కవితకు వ్యతిరేకంగా బలమైన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందున ఈ స్టేజీలో ఆమెకు బెయిల్ మంజూరు చేయలేమని తేల్చిచెప్పింది. బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
ఈడీ, సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకొని బెయిల్ నిరాకరిస్తున్నట్లు వెల్లడించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం.. సీబీఐ విచారణకు ట్రయల్ కోర్టు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఈ పిటిషన్లపై మే 27, 28 తేదీల్లో సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. అయితే జూన్ 1 నుంచి వేసవి సెలవులు రావడంతో దాదాపు నెల రోజులుగా ధర్మాసనం తీర్పు వాయిదా పడింది. సోమవారం నుంచి తిరిగి కోర్టు ప్రారంభం కావడంతో... జస్టిస్ స్వర్ణకాంత శర్మ మొత్తం 41 పేజీలతో తీర్పును వెలువరించారు.
ఇందులో కవిత అడ్వకేట్, ఈడీ, సీబీఐ వాదనలను పొందుపరిచారు. మొత్తం ఐదు అంశాల వారీగా... ధర్మాసనం తీర్పును వెలువరించింది. లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు అత్యంత కీలకదశలో ఉన్నదని, తుది చార్జ్షీట్లను దాఖలు చేయాల్సి ఉందని కోర్టు పేర్కొంది.
నేరానికి పాల్పడలేదని నిర్ధారించలేం
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాలను పరిశీలిస్తే.. ఆమె నేరానికి పాల్పడలేదని కోర్టు నిర్ధారణకు రాలేకపోతోందని ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ఈడీ సమర్పించిన సాక్ష్యాధారాలు, సెక్షన్ 250 కింద సాక్ష్యుల వాంగ్మూలాలు, సీఆర్పీసీ 144 కింద అప్రూవర్ల వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్స్ తోపాటు అనేక డాక్యుమెంటరీ సాక్ష్యాలు కవితకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ట్రిపుల్ టెస్ట్, పీఎంఎల్ఏ సెక్షన్ 45 కింద ట్విన్ టెస్ట్ లు పరిశీలిస్తే...
ఆమెకు బెయిల్ ఇవ్వడానికి కారణాలేమీ లేవని కోర్టు తెలిపింది. కవిత గతంలో వాడిన తొమ్మిది ఫోన్లలోని డేటాను ఎవరు ఫార్మెట్ చేశారన్న దర్యాప్తు సంస్థల ప్రశ్నలకు ఆమె క్లారిటీ ఇవ్వలేకపోయారని పేర్కొంది. దీనికి తోడు గతేడాది మార్చి 11న ఈడీ సమన్లు పంపిన తర్వాతే ఈ ఫోన్లు ఫార్మెట్ అయినట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ లు చూస్తే ఆమె సాక్ష్యాధారాలను చెరిపేసినట్టు అనుమానం కలుగుతున్నదని హైకోర్టు తెలిపింది. ఇప్పుడు బెయిల్ పై కవితను విడుదల చేస్తే మరిన్ని సాక్ష్యాలను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కేసులో ఉన్న పలువురు సాక్షులు కవితకు దగ్గరి వారని తెలిపింది. ‘‘కవిత విద్యార్హతలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు మెచ్చుకోదగినవే.
అయితే.. బెయిల్ దరఖాస్తును పరిశీలించేటప్పుడు ఇవేవీ పరిగణనలోకి రావు” అని కోర్టు అభిప్రాయపడింది. కేవలం మహిళ అన్న కారణంతో బెయిల్ మంజూరు చేయలేమని,.. కవితపై దర్యాప్తు సంస్థల ప్రాసిక్యూషన్ చేసిన తీవ్రమైన ఆరోపణలు, ఇన్విస్టిగేషన్ లో సేకరించిన సాక్ష్యాలను కాదనలేమని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఢిల్లీలో న్యూ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలు వెనుక జరిగిన కుట్రలో కవిత కింగ్ పిన్ గా ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయని గుర్తుచేసింది. ఈ కేసులో అరెస్టయిన సహనిందితులు కవిత కోసం పని చేసినట్లు ఆధారాలు ఉన్నాయని, అందువల్ల ఆమెను ఒక నిస్సహాయ మహిళగా భావించలేమని కోర్టు స్పష్టం చేసింది. కాగా.. ట్రయల్ కోర్టు, హైకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ... కవిత త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది.
