సీఎం రేవంత్​ను కలిసిన బీఆర్ఎస్​ .. ఎంపీ పసునూరి, ఎమ్మెల్యే దానం

సీఎం రేవంత్​ను కలిసిన బీఆర్ఎస్​ .. ఎంపీ పసునూరి, ఎమ్మెల్యే దానం
  • త్వరలో కాంగ్రెస్​లో చేరే చాన్స్!

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డిని మరో బీఆర్ఎస్​ ఎంపీ, ఎమ్మెల్యే కలిశారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం వేర్వేరుగా సీఎంతో భేటీ అయ్యారు. ఎంపీ దయాకర్ సెక్రటేరియెట్ లో సీఎంను కలిశారు. ఆయన వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జ్​ ఝాన్సీ రాజేందర్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు. 

కాగా, వచ్చే ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరును ఇటీవల బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన రెండు రోజులకే సీఎంను బీఆర్ఎస్ సిట్టింగ్​ ఎంపీ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో దయాకర్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, సెక్రటరీ రోహిత్ చౌదరి, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డితో కలిసి సీఎంను ఆయన నివాసంలో కలిశారు. 

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ పై దానం నాగేందర్ పొగడ్తలు కురిపించారు. కొత్త ప్రభుత్వానికి టైమ్ ఇవ్వాలని, అప్పుడే విమర్శలు చేయొద్దని వ్యాఖ్యానించారు. దానంతో పాటు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.