మంచిర్యాల జిల్లాలో ఓటమి షాక్​తో కదలని కారు!

మంచిర్యాల జిల్లాలో ఓటమి షాక్​తో కదలని కారు!
  • అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి ఇంకా తేరుకోని నేతలు 
  • సీఎం రేవంత్​రెడ్డిపై కామెంట్లతో విమర్శలపాలైన బాల్క సుమన్​ 
  • ఎన్నికల తర్వాత కనుమరుగైన మాజీలు.. పార్టీలో వీడని స్తబ్ధత  
  • కారు దిగిన సిట్టింగ్ ఎంపీ.. క్యాండిడేట్​ కోసం వెతుకులాట  
  • జోష్​ మీద హస్తం​.. జోరు పెంచిన కమలం.

మంచిర్యాల, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఓటమిపాలైన బీఆర్​ఎస్​ నేతలు ఇంకా ఆ షాక్​ నుంచి తేరుకోలేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అయినప్పటికీ వారు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేక ముఖం చాటేశారు. లోక్​సభ ఎన్నికలు దగ్గరపడడంతో కాంగ్రెస్​, బీజేపీలలో సందడి నెలకొనగా, గులాబీ పార్టీలో చడీచప్పుడు  లేదు. అధికారంలో ఉన్నప్పుడు మందీమార్బలంతో హడావుడి చేసిన లీడర్లు గత రెండున్నర నెలలుగా సైలెంట్​ కావడం చర్చకు దారితీసింది. 

ఇటీవల తూతూమంత్రంగా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి మళ్లీ కనుమరుగయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ గ్రాఫ్​ మరింత డౌన్​ కావడం, ఎంపీ ఎన్నికల కార్యాచరణ ఇంకా మొదలు పెట్టకపోవడంతో బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు.  

కనిపించని మాజీలు.. కాంగ్రెస్​లోకి లీడర్లు..

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్​ఎస్​లో నెలకొన్న స్తబ్ధత ఇప్పటికీ వీడడం లేదు. మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ ముఖ్య నాయకులు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చెన్నూర్​ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ హైదరాబాద్​కే పరిమితమయ్యారు. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి మళ్లీ తెరమరుగయ్యారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా లోకల్​గా ఉండడం లేదు. 

మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు అప్పుడప్పుడు పెళ్లిళ్లు, శుభకార్యాల్లో కనిపిస్తూ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్​ చాలారోజుల నుంచి అంటీముట్టనట్టు ఉండడం తెలిసిందే. పార్టీని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో నాయకులు, కార్యకర్తలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే మంచిర్యాల, నస్పూర్​, బెల్లంపల్లి, క్యాతన్​పల్లి మున్సిపాలిటీలను కాంగ్రెస్​ కైవసం చేసుకుంది. 10 మంది జడ్పీటీసీ మెంబర్లు కాంగ్రెస్​లో చేరడానికి ఆ పార్టీ లీడర్లతో మంతనాలు జరుపుతున్నారు. రేపోమాపో సీఎం రేవంత్​రెడ్డి సమక్షంలో మూకుమ్మడిగా కాంగ్రెస్​ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం.

కాంగ్రెస్​లో జోష్​.. జోరు పెంచిన కమలం..

 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ పరిధిలోని ఏడు సీట్లను క్లీన్​ స్వీప్​ చేసిన కాంగ్రెస్​ ఎంపీ ఎన్నికల్లోనూ అదే జోష్​ కొనసాగిస్తోంది. రాష్ర్టంలో 14 ఎంపీ సీట్లను గెల్చుకుంటామని ఆ పార్టీ నేతలు చెపుతుండగా, అన్ని సర్వేలు హస్తానికే మెజారిటీ వస్తుందని వెల్లడిస్తున్నాయి. పెద్దపల్లిలో కాంగ్రెస్​కే విన్నింగ్​ చాన్సెస్​ ఎక్కువగా ఉన్నాయని తేలుస్తున్నాయి. చెన్నూర్​ ఎమ్మెల్యే డాక్టర్​ జి.వివేక్​ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి బరిలో నిలవడానికి ఉత్సాహం చూపుతున్నారు. 

కాకా వెంకటస్వామి ఫ్యామిలీకి ఈ సెగ్మెంట్​తో యాభై ఏండ్లకు పైగా అనుబంధం ఉంది. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అందరి మద్దతును కూడగట్టుకుంటున్నారు. ఇక బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోడీపైనే ఆశలు పెట్టుకొని ఎన్నికలకు సిద్ధమవుతోంది. కిందటిసారి పెద్దపల్లి చుట్టుపక్కలున్న నాలుగు ఎంపీ సీట్లను గెల్చుకోవడంతో ఈసారి ఈ సెగ్మెంట్​పై దృష్టి పెట్టింది. రెండు రోజుల కిందట కేంద్ర మంత్రి, పార్టీ స్టేట్​ చీఫ్​ జి.కిషన్​రెడ్డి జిల్లాలో విజయ సంకల్ప యాత్ర చేశారు. కానీ ప్రజల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి లోనయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క మంచిర్యాలలో తప్ప మిగతా ఆరు నియోజకవర్గాల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. అలాగే ఆ పార్టీకి బలమైన అభ్యర్థి లేకపోవడం మైనస్​గా మారిందని అంటున్నారు.

కారు దిగిన ఎంపీ.. క్యాండిడేట్​ ఎవరో మరి..?  

కొంతకాలంగా బీఆర్​ఎస్​ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పెద్దపల్లి సిట్టింగ్​ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్​ నేత ఇటీవలే కారు దిగి కాంగ్రెస్​లో చేరారు. దీంతో రానున్న ఎంపీ ఎన్నికల్లో కొత్త క్యాండిడేట్​ కోసం హైకమాండ్​ వెతుకులాట మొదలుపెట్టింది. మాజీ మంత్రి, ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్​ పేరు తెరపైకి వచ్చినా ఆయన సుముఖంగా లేడని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్​ఎస్​ నుంచి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటున్నారు. 

మరోవైపు లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్​ఎస్​ పొత్తుపై చర్చ నడుస్తోంది. బీజేపీ రాష్ర్ట నాయకులు దీనిని ఖండిస్తున్నా కేంద్ర నాయకత్వం సస్పెన్స్​ కొనసాగిస్తోంది. ఒకవేళ పొత్తు కుదిరితే పెద్దపల్లి ఎంపీ సీటును ఎవరికి కేటాయిస్తారన్నది ఇంట్రెస్టింగ్​గా మారింది. బీఆర్​ఎస్​ ఒంటరి పోరుకు సిద్ధపడినా చివరి నిమిషం దాకా అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదంటున్నారు.