డిబేట్కు పిలిచి అవమానించడం దారుణం..చానెల్ పై చర్యలు తీసుకోవాలి: మధుసూదనా చారి

డిబేట్కు పిలిచి అవమానించడం దారుణం..చానెల్ పై చర్యలు తీసుకోవాలి: మధుసూదనా చారి
  • మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డికి ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీని డిబేట్​కు పిలిచి ఓ చానెల్​అవమానించడం దారుణమని, చానెల్ తీరును ఖండిస్తున్నామని బీఆర్ఎస్​ మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి అన్నారు. బీఆర్ఎస్​ పార్టీపై కుట్ర పూరితంగా డిబేట్ హోస్ట్ వ్యవహరించారని..దాన్ని ఎమ్మెల్సీ రవీందర్​ రావు అడ్డుకోవడంతోనే హోస్ట్​ అనుచిత వ్యాఖ్యలు చేశారని వివరించారు. ఈ వ్యవహారంపై మంగళవారం ఆయన అసెంబ్లీలో శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డికి ఫిర్యాదు చేశారు. 

ఆ చానెల్​పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది రవీందర్ రావుపై జరిగిన దాడి కాకుండా మండలి సభ్యుల మీద జరిగిన దాడిగా భావించి చర్యలు తీసుకోవాల్సిందిగా చైర్మన్​ను కోరామని మధుసూదనా చారి వెల్లడించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ..చానెల్ డిబేట్​లో జరగనివి జరిగినట్టు చూపించే ప్రయత్నం చేశారని, దానిని అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు యాంకర్ తనపై అనుచిత కామెంట్లు చేశారని తెలిపారు. 

పిచ్చిరాతలు, విషప్రచారం చేసే వారిపట్ల తాను డిబేట్​లో మాట్లాడనని, గెస్ట్​గా పిలిచి అవమానించడం కలచివేసిందని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న చానెల్స్​పై, పత్రికలను ఉద్దేశించి మాత్రమే రవీందర్​ రావు మాట్లాడారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. అందుకు ఆయన పట్ల దురుసుగా వ్యవహరించడం దారుణమని తెలిపారు.  గెట్​అవుట్​అనడం దురహంకారమేనని శ్రీనివాస్ పేర్కొన్నారు.