పార్టీ ఫిరాయింపులపై..మీరా మాట్లాడేది : టి.రామ్మోహన్ రెడ్డి

పార్టీ ఫిరాయింపులపై..మీరా మాట్లాడేది : టి.రామ్మోహన్ రెడ్డి
  •  గతంలో కేసీఆర్ 39 మంది ఎమ్మెల్యేలను కొన్నడు 

హైదరాబాద్, వెలుగు : పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడడం.. దెయ్యా లు వేదాలు వల్లించినట్టుగా ఉందని పరిగి కాంగ్రెస్ ఎమ్మె ల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పదేండ్ల పాటు విచ్చల విడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్ లో రామ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2014, 2018లో టీడీపీ, వై సీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, బెదిరించి కేటీఆర్, హరీశ్ రావు వాళ్ల ఇండ్ల చుట్టూ ప్రదక్షణలు చేసి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని అన్నారు. 

ఇతర పార్టీల నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిని మంత్రు లుగా కూడా చేశారని  గుర్తు చేశారు. “ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండానే కేబినెట్​లో తీసుకున్నారు. అప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు స్పీకర్లు మధుసూదనచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకోలేదు. కనీసం ఆ ఫిర్యాదులపై స్పీకర్ ఒక్క సారి కూడా పిలిచి వివరణ కోరలేదు” అని అన్నారు. కేసీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు సైతం అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు.

ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా పూర్తి కాకముందే బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నాని రామ్మోహన్​రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం కూలిపోతుందని కడియం శ్రీహరి, కేసీఆర్ సీఎం అవుతాడని.. ఆరు నెలల్లో మా ప్రభుత్వం వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీటింగ్​లో కేటీఆర్ అన్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా..? అని మండిపడ్డారు.