బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డైనా ఇచ్చిందా?

బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డైనా ఇచ్చిందా?
  • ఎవరూ టెన్షన్​ పడొద్దు.. మేం అందరికీ ఇస్తం ..
  • హైదరాబాద్​ ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
     

హైదరాబాద్​సిటీ/ ముషీరాబాద్/ అంబర్​పేట/ పద్మారావునగర్, వెలుగు: పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్​ఎస్​ పేదలకు ఒక్క రేషన్​ కార్డు కూడా ఇవ్వలేదని హైదరాబాద్​ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. తాము అధికారంలోకి రాగానే రేషన్​ కార్డులు పంపిణీ చేస్తున్నామని, రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ కార్డులు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. శనివారం రెండో రోజు నగరంలోని అంబర్​పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్​ నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు కొత్త రేషన్​కార్డులను పొన్నం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ లో 55 వేల కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని.. ఖైరతాబాద్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఇప్పటికే కార్డులు పంపిణీ చేశామన్నారు.

ఆరు గ్యారంటీలు అమలుచేస్తూ..

కాంగ్రెస్​ ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తోందన్నారు. ఇప్పటికే ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్​సిలిండర్, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, రైతుభరోసా అమలవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు పద్మారావు, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, జీహెచ్​ఎంసీ కమిషనర్​ కర్ణన్, వి.హనుమంతరావు, రోహిణ్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

జూబ్లిహిల్స్​లో గెలవాలి..

హైదరాబాద్ సిటీ: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ పార్టీ జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో గెలిస్తేనే ఇక్కడ ఎంతో అభివృద్ధి జరుగుతుందని మంత్రులు పొన్నం ప్రభాకర్​, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం పీజేఆర్ కమిటీ హాల్ లో సోమాజిగూడ డివిజన్ కాంగ్రెస్ బూత్ లెవల్ ఇన్​చార్జిలు, ముఖ్య కార్యకర్తలతో వారు సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుతాయన్నారు. గ్రంథాలయ చైర్మన్ రియాజ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం తదితరులు పాల్గొన్నారు.