ఎలాంటి దుస్థికి వచ్చింది బీఆర్ఎస్.. ఎంపీ అభ్యర్థుల కోసం వేట

ఎలాంటి దుస్థికి వచ్చింది బీఆర్ఎస్.. ఎంపీ అభ్యర్థుల కోసం వేట
  •  సికింద్రాబాద్, మల్కాజిగిరిలోపోటీకి ఆసక్తి చూపని బీఆర్ఎస్ నేతలు 
  • మొన్నటిదాకా పోటీ చేస్తామని ముందుకొచ్చిన వారు సైతం వెనుకంజ 
  • పార్టీ అధికారం కోల్పోవడంతో ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితులు
  • పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్కపోవడంతో  బీఆర్ఎస్ బేజార్​
  • అధికారంలో వెలుగు వెలిగిన గులాబీ క్యాడర్ కు ఓటమి తర్వాత విచిత్ర పరిస్థితి

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్​కు పట్టం కట్టినా.. గ్రేటర్​సిటీలో బీఆర్ఎస్ ను గెలిపించారు. మొత్తం 24 స్థానాల్లో 13 మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీ గెలుచుకుంది. అయినా అధికారం కోల్పోగా.. ఆ పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయింది. గ్రేటర్​సిటీలోనైతే పరిస్థితి ఘోరంగా తయారైంది. బీఆర్ఎస్​కార్పొరేటర్లు కాంగ్రెస్​లోకి క్యూ కట్టారు. ఏకంగా డిప్యూటీ మేయర్ కూడా చేరడంతో  బల్దియా కౌన్సిల్​లో గులాబీపార్టీ ఇరకాటంలో పడింది.

 తాజాగా ఖైరతాబాద్​ఎమ్మెల్యే దానం నాగేందర్​కూడా కారు దిగి సొంతగూటికి చేరారు.  సికింద్రాబాద్​పార్లమెంట్​స్థానం పరిధిలో నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ తప్ప మిగిలిన ఆరు చోట్ల, మల్కాజిగిరి పార్లమెంట్​స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో  బీఆర్ఎస్​ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇలా మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా లోక్ సభకు ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. 

వెనుకంజ వేస్తున్న నేతలు!

మల్కాజిగిరిలో రోజుకో నేత తెరపైకి వస్తున్నారు. మొదట మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి పేరు వినిపించింది. తర్వాత ఆయన కొడుకు భద్రారెడ్డి పోటీ చేస్తారని, అనంతరం ఎమ్మెల్సీ శంభీపూర్​రాజు అభ్యర్థిగా ఖరారైనట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత మరో నేత రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థి అంటూ ప్రచారం జరగగా.. రోజు రోజుకు మారే రాజకీయ పరిణామాలతో వారంతా పోటీకి వెనుకడుగు వేసినట్టు తెలిసింది. రాగిడి లక్ష్మారెడ్డి సైతం నోటిఫికేషన్​నాటికి పోటీలో ఉంటారా? లేదా? అనేది కూడా సస్పెన్స్​గానే ఉంది. సికింద్రాబాద్​పార్లమెంట్​సీటులోనూ అదే పరిస్థితి ఉంది. 

ఇక్కడి నుంచి బీఆర్ఎస్ కు ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నా లోక్ సభకు పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. గత పార్లమెంట్​ఎన్నికల్లో  మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ కొడుకు సాయికిరణ్ యాదవ్​పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోగా ఇప్పుడు ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపడంలేదు. ఆయన కార్యకర్తల్లో, అనుచరుల్లో ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. సాయికిరణ్​ యాదవ్ పోటీ చేసేందుకు సిద్ధంగా లేరని కూడా సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఇక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థిపై ప్రస్తుతం సస్పెన్స్​నెలకొంది. 

కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ

 గ్రేటర్​సిటీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్​కోసం ఆశావహులు భారీగా పోటీ పడ్డారు. టికెట్ రానివారికి పార్లమెంట్ ఎన్నికల్లో చాన్స్ ఇస్తామని బీఆర్ఎస్ అధిష్టానం కూడా హామీ ఇచ్చింది. కానీ అధికారం కోల్పోయింది. దీంతో ఎంపీగా పోటీకి నేతలు భయపడుతున్న పరిస్థితి ఉంది. ఆసక్తి చూపకపోవడానికి పలు కారణాలు లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లోని ప్రజా వ్యతిరేకత ఈసారి కూడా పార్టీపై ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

ప్రస్తుతం కాంగ్రెస్​అధికారంలో ఉండగా.. కేంద్రంలోని అధికారంలోని బీజేపీ బలమైన పార్టీలుగా మారాయి. దీంతో వాటిని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్​కు లేదని ఆ పార్టీ సీనియర్​నాయకుడొకరు అభిప్రాయపడ్డారు.  రెండు పార్లమెంట్​స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. ప్రస్తుత కాంగ్రెస్​కు ఉన్న అనుకూల వాతావరణంలో అది పనిచేయదనే వాదన కూడా ఉంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉండనుండగా, బీఆర్ఎస్​పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.