విగ్రహాలు కొనివ్వడం మొదలు నిమజ్జనం దాకా దగ్గరుండి ఏర్పాట్లు

విగ్రహాలు కొనివ్వడం మొదలు నిమజ్జనం దాకా దగ్గరుండి ఏర్పాట్లు
  • 2 వేల దాకా విగ్రహాలను నేతలే పెట్టించిన్రు
  • బియ్యం, నగదు పంపిణీలోనూ పోటాపోటీ! 
  • ఫ్రీగా ఖర్చులు వెళ్లిపోవడంతో మండపాల నిర్వాహకులు ఖుష్​

నిజామాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఈ సారి గణేశుడిపై పడింది. ఓటర్లను చేరువయ్యేందుకు ఇదో అవకాశంగా భావించిన పొలిటికల్​లీడర్లు, ముఖ్యంగా బీఆర్ఎస్​ అభ్యర్థులు పోటీపడి మరి వినాయక మండపాలు ఏర్పాటు చేయించారు. వాటికి ఆర్థికంగా దన్నుగా నిలిచారు. అభ్యర్థిత్వాలు డిక్లేర్​ కానప్పటికీ, తాము వెనుకపడొద్దనే ఆలోచనతో ఇతర పార్టీల లీడర్లు విఘ్నేశ్వరుడి భారాన్ని నెత్తినమోశారు. గతంలో ఎప్పడూలేని రీతిలో ఈసారి రికార్డు స్థాయిలో జిల్లాలో 7 వేల మండపాలను ఏర్పాటు చేశారు. 

రూ.రెండున్నర కోట్ల విలువ బియ్యం

గణేశ్​ఉత్సవాల్లో అన్నదానాలకు జిల్లాలోని అన్నీ పొలిటికల్​పార్టీల లీడర్లు సుమారు రూ.రెండున్నర కోట్ల విలువజేసే బియ్యం పంపిణీ చేశారు. ఆర్మూర్​సెగ్మెంట్​లో సిట్టింగ్​ఎమ్మెల్యే జీవన్​రెడ్డి, బీజేపీ లీడర్​పైడి రాకేశ్​రెడ్డి, కాంగ్రెస్ ​లీడర్​ వినయ్​రెడ్డి పోటాపోటీగా బియ్యాన్ని పంచారు. అన్నదానానికి 2,230 క్వింటాళ్ల రైస్ ​పంపిణీ చేసినట్లు సమాచారం. 

ALSO READ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో12 సీట్లు గెలుస్తాం : మంత్రి హరీశ్​రావు

బోధన్ లోనూ​ తక్కువేం కాదు..

బోధన్​ సెగ్మెంట్​లో బియ్యంతో పాటు మండపాలకు నగదు సహాయం చేశారు. బీఆర్ఎస్ ​అభ్యర్థి షకీల్, బీజేపీ నుంచి టికెట్​ఆశిస్తున్న మేడపాటి ప్రకాశ్​రెడ్డి రూ.50 లక్షల విలువైన బియ్యం, రూ.25 లక్షల క్యాష్​ పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. యువ ఓటర్లను ఆకర్శించేందుకు మొన్నటి వరకు ఉచితంగా డ్రైవింగ్​ లైసెన్సులు ఇప్పించిన బీఆర్ఎస్​లీడర్లు, ఇప్పుడు ఉచిత డ్రైవింగ్​ శిక్షణ కార్యక్రమాన్ని 
ప్రారంభించారు.

మంత్రి నగదు పంపిణీ.. 

బాల్కొండ నియోజకవర్గంలోని గణేశ్​ మండపాలకు మంత్రి ప్రశాంత్​రెడ్డి రూ.పది వేల చొప్పున ఇచ్చినట్లు సమాచారం. అర్బన్​లో బీజేపీ టికెట్​ఆశిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్​పాల్​సూర్యనారాయణ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిమరి నగరంలోని మండపాలకు చందాలు ఇచ్చారు. అన్నదానాలకు బియ్యం, సరుకులు పంపిణీ చేశారు.

రికార్డు స్థాయిలో మండపాలు

జిల్లాలో ఈ ఏడాది సుమారు 7 వేల గణేశ్​మండపాలు ఏర్పాటు చేశారు. గతంలో ఈ సంఖ్య 5000లోపే ఉండేది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని లీడర్లు ప్రతీ గల్లీలో విగ్రహాలను ప్రతిష్టించేలా చేశారు. ఇప్పుడు నిమజ్జనం పూర్తయినందున పొలిటికల్​గా పొందిన లాభాన్ని లెక్కలు వేస్తున్నారు.