కులగణనకు వచ్చే ఆఫీసర్లను నిలదీయండి : కేటీఆర్​

కులగణనకు వచ్చే ఆఫీసర్లను నిలదీయండి : కేటీఆర్​
  • బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించాకే పంచాయతీ ఎలక్షన్లు పెట్టాలి : కేటీఆర్​
  • కామారెడ్డి బీసీ డిక్లరేషన్​పై కాంగ్రెస్​ను వదిలి పెట్టేదే లేదు
  • మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం అబద్ధాలు చెప్పిండు

వరంగల్, వెలుగు : కులగణనకు వచ్చే ఆఫీసర్లను జనాలు నిలదీయాలని బీఆర్​ఎస్​ పార్టీ రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​అన్నారు. కులగణనలో ప్రశ్నలను తగ్గించాలని, కులాలు, ఉప కులాల లెక్క తేల్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలన్నారు. కేటీఆర్ ఆదివారం గ్రేటర్​ వరంగల్​లో పర్యటించారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. ‘‘42 శాతం రిజర్వేషన్లు డిక్లేర్​ చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెడ్తామని అధికారులను రాసివ్వమనండి.

ఈ విషయంపై ఎమ్మెల్యేలను, ఆ పార్టీ కార్యకర్తలను కూడా నిలదీయండి. ఈ సర్వే.. పథకాలు ఎగరకొట్టడానికా, ఉద్దరించడానికా? అని నిలదీయండి” అని పిలుపునిచ్చారు. మీ కులమేంటి, మీ ఉప కులమేంటి, మీకు ఫ్రిజ్​ఉందా.. ఏసీ ఉందా.. మీ ఇంట్లో ఎన్ని రూపాయలున్నయ్.. మీకు రాజకీయ పార్టీలతో సంబంధం ఉందా.. అని  ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల కోసమే ఇక్కడ కాంగ్రెస్​ ప్రభుత్వం కులగణన అంటోందన్నారు.  

బీసీలకిచ్చిన హామీలు ఏడబోయినయ్

గతేడాది నవంబర్ 10న కాంగ్రెస్​ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ లో భాగంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కేటీఆర్​ ప్రశ్నించారు. కాంగ్రెస్​ గవర్నమెంట్​ వచ్చాక కొత్త పథకాల మాటేమోగానీ.. పాతవి కూడా రద్దయ్యాయన్నారు. ముదిరాజ్, గొల్లకురుమ, కుమ్మరి, కమ్మరి, గౌడ, పద్మశాలి వంటి బీసీలకు ఇస్తామన్న పథకాలేవని అడిగారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్​ పెంపు, బీసీ గురుకులాలు, డిగ్రీ కాలేజీలు ఎక్కడికి పోయాయన్నారు. కనీసం ఒక్క బీసీ బిడ్డకైనా వడ్డీలేని రుణం ఇచ్చావా.. అని నిలదీశారు.

మహారాష్ట్రలో సీఎం రేవంత్​రెడ్డి అబద్ధాలు చెప్పాడని కేటీఆర్​ విమర్శించారు. ‘‘మనకు హిందీ రాదనుకున్నాడో.. అక్కడ మాట్లాడింది ఇక్కడ వినరు అనుకున్నడో.. రూ.500 బోనస్​ ఇస్తున్నానని బోగస్​ ముచ్చట చెప్పిండు. ఒక్కరికన్నా ఇచ్చినట్టు సూపియ్యి.. అందరం రాజీనామా చేస్తం. రుణమాఫీ చేశానని చెబుతుండు. రైతు బంధు, రైతు భరోసా పేరుతో ఫుల్​ పేజీ యాడ్స్ ఇస్తున్నడు.. ఎవరిదా సొమ్ము” అని ప్రశ్నించారు.

పొంగులేటిది బాంబుల శాఖ..

పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిది ఏ శాఖనో తనకు తెలియదని, ఆయన శాఖకు బాంబుల శాఖ అని పేరు పెడితే బాగుంటుందన్నారు. ‘‘ఈ బాంబు పేలుతది.. ఆ బాంబు పేలుతదని అన్నడు. ఏ బాంబు​ పేలి ఏ కాంగ్రెస్​ లీడర్  ఎగిరిపోతడో తెల్వదు. ఏం చేశారని విజయోత్సవాలు చేస్తున్నరు. పార్టీలో చర్చించి కాంగ్రెస్​ ప్రభుత్వ  వైఫల్యాల వారోత్సవాలు చేస్తం. శాఖలవారీగా కాంగ్రెస్​ మోసాలను ప్రజలకు చెప్తం’ అన్నారు. తన పాదయాత్ర వివరాలు తర్వాత వెల్లడిస్తానన్నారు. 

విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా?

ఎనుముల రేవంత్​రెడ్డి వారి ఏడాది ఏలికలో తెలంగాణ బతుకు చీలికలు, పీలికలుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలు ఎలా జరుపుకుంటారని సోషల్ మీడియా ‘ఎక్స్’​లో ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకీ పాతరేశారని, కనుక ప్రజావంచన వారోత్సవాలు నిర్వహించాలని విమర్శించారు. ‘‘మూసీలో లక్షన్నర కోట్ల మూటల వేట. కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట. బావమరిదికి అమృత్ టెండర్లను, అయినవారికి వేలకోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు..

కరప్షన్​ కార్నివాల్. సకల రంగాల్లోనూ సంక్షోభం తప్ప సంతోషం లేని పాలన కాంగ్రెస్​ది. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఒక్కటి కూడా సరిగ్గా అమలుచేయకుండా 25 రోజులపాటు జల్సాలు చేసుకుంటారా? రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం అందక పేద రైతులు బాధలో ఉంటే మీరు విజయోత్సవాల పేరిట విర్రవీగుతారా? హైడ్రా, మూసీ బాధితులు బాధలో ఉంటే మీరు పండుగ చేసుకుంటారా?  వృద్ధులు పింఛన్ల పెంపు కోసం చూస్తుంటే మీరు దావత్ లు చేసుకుంటారా?’’ అని ఎక్స్​లో నిలదీశారు.

నేతన్నలకు ఆర్డర్లు ఇవ్వడానికి..నా పదవే అడ్డయితే రాజీనామా చేస్త.. 

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి తన పదవే అడ్డయితే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో రెండ్రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న దంపతుల కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘నేతన్నలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు.

సిరిసిల్లలో 20 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్ కానుకలు, కేసీఆర్ కిట్టు లాంటివి ప్రభుత్వం రద్దు చేసింది. నేతన్నలకు ఆర్డర్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి నా పదవే అడ్డయితే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను” అని చెప్పారు.