నన్ను అరెస్ట్ చేసినా బీజేపీకి లొంగను : రోహిత్ రెడ్డి

నన్ను అరెస్ట్ చేసినా బీజేపీకి లొంగను  : రోహిత్ రెడ్డి

తనను, తన కుటుంబ సభ్యులను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. తగ్గేదే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. తనను మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈడీ నోటీసులను ఛాలెంజ్ చేస్తూ.. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని వెల్లడించారు. న్యాయ వ్యవస్ధపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. మనీ లాండరింగ్ పైనే విచారించాలని పైలట్ రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈడీ అధికారులు అకస్మాత్తుగా రూట్ మార్చి.. నందకుమార్ ను విచారించేది ఉందంటూ కోర్టులో పిటిషన్ వేశారని పేర్కొన్నారు. నందకుమార్ స్టేట్మెంట్ ద్వారా నన్ను కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు నాకు అనిపిస్తోందన్నారు. నందకుమార్ తో ఎలాంటి వ్యాపార, ఆర్ధిక లావాదేవీలు లేవని.. విచారణలో ఇవి తేలిందన్నారు. దీంతో కొత్త కుట్రలకు తెర లేపారని ఆరోపించారు.

‘కేసు వివరాలు చెప్పకుండా  ED నన్ను బయోడేటా ఇవ్వమంది. మొదటిరోజు 6 గంటలు కూర్చోబెట్టి కేసు వివరాలు చెప్పలేదు. రెండోరోజు కేసు వివరాలు చెప్పాలని డిమాండ్ చేస్తే ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో అని చెప్పారు. కేసుతో సంబంధం లేకున్నా అభిషేక్ ను విచారణకు పిలిచారు. దేశంలో హై స్పీడ్ లో వెళ్తున్న బీజేపీకి  బ్రేక్ వేసాను. ఇది బీఆర్ఎస్ సమస్య కాదు..తెలంగాణ ప్రజల సమస్య.’ అని వ్యాఖ్యానించారు.

తన విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ ఇందుకు నిదర్శనమని పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ఈడీ పరిధిలోకి ఈ కేసులో ఎలా విచారిస్తారని ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన తననే విచారించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ చూసిందని.. ఆ పార్టీ ఆటలు తెలంగాణలో మాత్రం సాగవన్నారు. బీజేపీ అరాచకాలకు ఈడీ, సీబీఐ, ఐటీ సంస్ధలు అస్త్రాలుగా మారాయన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వంపై మళ్లీ ఉద్యమించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.