వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కోసం బీఆర్ఎస్ ప్లాన్లు 

వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కోసం బీఆర్ఎస్ ప్లాన్లు 
  • మన బలమెంత..వారి బలమెంత ?
  • పథకాలు అందాయా? ఇంకేం కావాలి? 
  • వివరాలు రాబట్టేందుకు సర్వేలు చేయిస్తున్న ఎమ్మెల్యేలు 
  • ప్రతి నియోజకవర్గంలో వంద ఓటర్లకు ఒక ఇన్​ఛార్జి  
  • ఆపై డివిజన్​అధ్యక్షులు, లీడర్లకు బాధ్యతలు
  • వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కోసం ప్లాన్లు 

హనుమకొండ, వెలుగు: అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఎన్నికల గుబులు పట్టుకుంది. ఈ ఏడాదిలోనే ఎలక్షన్లు జరగనుండటంతో సిట్టింగ్​ఎమ్మెల్యేలు జనం పల్స్​ తెలుసుకునే పనిలో పడ్డారు. ఓటర్లకు బీఆర్ఎస్​పార్టీ ద్వారా అందిన పథకాలు, ప్రభుత్వం నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పనిలో పనిగా నియోజకవర్గాల్లో తమ బలం..ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న వారి బలం అంచనా వేస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గాల్లో తమ పార్టీ లీడర్లను రంగంలోకి దించి సర్వేలు చేయిస్తున్నారు. ప్రతి వంద ఓటర్లకు ఒక ఇన్​ ఛార్జీని నియమించారు. ఇదంతా చూసుకోవడానికి గ్రామ, డివిజన్​శాఖ అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించారు. వారు ఫీల్డ్​లెవెల్​లో వివరాలు సేకరించి ఎమ్మెల్యేలకు అందజేస్తే.. ఆయా రిపోర్టుల ప్రకారం ఎలక్షన్​ లో ఎలా ముందుకు వెళ్లాలో కసరత్తు చేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్​హై కమాండ్​ఈసారి టికెట్ కట్​చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో.. తమ బలాన్ని చూపించుకునేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 

ఆ మూడు ఎన్నికల లెక్కనే.. 

బీఆర్ఎస్​ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్, మునుగోడు ఎలక్షన్లలో మాదిరిగానే నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు సర్వే చేయించుకుంటున్నారు. హుజూరాబాద్​ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ను ఓడించేందుకు సీఎం కేసీఆర్..మంత్రి హరీశ్​రావు, ప్లానింగ్ బోర్డు వైస్​చైర్మన్​బోయినపల్లి వినోద్​కుమార్​లకు ఎన్నికల ఇన్​ఛార్జీ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు గ్రౌండ్​లెవెల్​లో పార్టీ పరిస్థితిని తెలుసుకుని, ముందుకు వెళ్లేందుకు ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్​ఛార్జీని నియమించారు. తర్వాత మండలానికో మంత్రి, ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించి ఎలక్షన్ వరకు అక్కడే క్యాంపెయిన్​నిర్వహించారు. ఇదే పద్ధతిని మునుగోడులోనూ ఫాలో అయ్యారు. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ కూడా ఇట్లాగే చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి వంద మంది ఓటర్లను ఒక క్లస్టర్​గా విభజించి, ఒక ఇన్​ఛార్జీని నియమించారు. వారిపై బూత్​కమిటీలు, పార్టీ గ్రామ, డివిజన్ శాఖ అధ్యక్షులు, సీనియర్​లీడర్లకు బాధ్యతలు అప్పగించారు. ఫీల్డ్​లో సర్వే చేసేందుకు ప్రత్యేక ప్రొఫార్మా సిద్ధం చేశారు. నియోజకవర్గస్థాయి లీడర్లతో పాటు మున్సిపల్​కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, గ్రామ, డివిజన్​అధ్యక్షులతో మీటింగ్​నిర్వహించారు. వారికి ప్రొఫార్మా కాపీలు అందజేశారు. ఈ కాపీలతో పాటు ఓటర్ల జాబితా తీసుకున్న వంద ఓట్ల ఇన్​ఛార్జీలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

ఏమేం పథకాలు అందుతున్నయ్​?

 పార్టీ నుంచి ప్రజలకు అందుతున్న పథకాలతో పాటు జనాలు ఎక్కువగా ఏ పార్టీ వైపు ఉన్నారో తెలుసుకునేలా ఈ సర్వేను ప్లాన్​చేశారు. ‘వర్ధన్నపేట నియోజకవర్గంలో ఓటర్​నంబర్, ఇంటి నంబర్​, ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు, కులం, సెల్​ఫోన్​నంబర్, ఓటరుకు అందుతున్న పథకాలు, ఏం పథకాలు కావాలి’ అని అడుగుతూ వివరాలు రాబడుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లతో పాటు ప్రస్తుత బీఆర్ఎస్​ ప్రభుత్వంలో ఏం లబ్ధి పొందారో తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఇంతవరకు ఎలాంటి పథకాన్ని తీసుకోని వారు ఉంటే డబుల్​ బెడ్​రూం ఇండ్లు, రేషన్​ కార్డులు, పింఛన్లు, రైతుబంధు, దళితబంధు ఇలా వివిధ పథకాల పేర్లు చెప్పి.. ఓటరుకు ఏమేం కావాలో అడిగి రాసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎందుకిదంతా అని ప్రశ్నిస్తున్న ఓటర్లకు ‘ఓటరు కోరుకునే సంక్షేమ పథకాలు అందించేందుకే రిపోర్ట్ తయారు చేస్తున్నాం’ అని సమాధానమిస్తున్నారు. ఇంతేగాకుండా సదరు ఓటరు ఏ పార్టీకి చెందినవాడు? ఏమైనా రిమార్క్స్​ఉన్నాయా? అనే విషయాలు తెలుసుకునేందుకు కూడా ప్రత్యేక కాలమ్స్​మెన్షన్​ చేశారు. ఆయన ఉంటున్న పార్టీలో ఎలా పని చేస్తాడు? ప్రవర్తన ఎలా ఉంటుంది? వంటి వివరాలు సేకరిస్తున్నారు. ఒకవేళ సదరు ఓటరు ఇతర పార్టీల్లో ఉండి తమకు ఉపయోగపడతాడని భావిస్తే వారిని బీఆర్ఎస్​లోకి లాగొచ్చనే ప్లాన్​లో ఉన్నట్టు తెలిసింది. 

రిపోర్టుల ఆధారంగా జంపింగ్ ​!

రాష్ట్రంలో ముందస్తు ఎలక్షన్స్​వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండడంతో ఇప్పటికే  బీజేపీ, కాంగ్రెస్​పార్టీలు జనాల్లోకి వెళ్తున్నాయి. ఈ కారణంతో కూడా బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు మరింత త్వరపడి సర్వేలు చేయిస్తున్నారని తెలుస్తోంది. తాము పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గం నుంచి పోటీ ఎక్కువై టికెట్ రాదని తెలిస్తే సర్వేలో తేలిన బలం ఆధారంగా ఇతర పార్టీల్లోకి జంప్​చేసేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు టికెట్లు తమకే ఇస్తారా లేదా అన్న విషయాన్ని కన్ఫమ్​చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. కొన్ని రోజుల కింద మంత్రి దయాకర్​రావు 20 మంది ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్​100 సీట్లు గెలుస్తుందని కామెంట్ చేయడంతో చాలామంది జాగ్రత్త పడుతున్నారు. దీంతోనే కొంతమంది ఎమ్మెల్యేలు సర్వే స్పీడప్​చేయాల్సిందిగా కిందిస్థాయి లీడర్లను ఆదేశిస్తున్నారు.

ముందస్తు వ్యూహం.. 

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ పడే ఆశావహుల సంఖ్య తక్కువేం లేదు.ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తుండటంతో ఇప్పటినుంచే అంతర్గత పోరు మొదలైంది. వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గ టికెట్​ను కూడా సిట్టింగ్​ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​కు కాకుండా ఇతరులకు కేటాయించే అవకాశం ఉందనే  ప్రచారం జరుగుతోంది. రమేశ్​కు ఎంపీ టికెట్​ఇచ్చి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్​ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తోంది.దీంతో ఎమ్మెల్యే రమేశ్​ముందస్తుగా సర్వే చేయించుకుంటున్నారని, సర్వేలో తన బలం ఏమిటో అధిష్ఠానానికి తెలియజేసేందుకే ఇలా చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పావు వంతు సర్వే కంప్లీట్​ అయ్యిందంటున్నారు. దీంతో ఇదే దారిలో స్టేషన్​ ఘన్ పూర్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నడుస్తున్నారు. ప్రతి 200 మంది ఓటర్లకు ఒక ఇన్​ఛార్జిని నియమించి ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరించడంతో పాటు జనం పల్స్​ తెలుసుకునేందుకు సర్వే చేయిస్తున్నట్టు భావిస్తున్నారు.