
వెలుగు, నెట్వర్క్: కాంగ్రెస్ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ తమ తప్పులను కప్పి పుచ్చుకుంటుందని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజక్టుపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడాన్ని నిరసిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద సిద్దిపేట టౌన్, రూరల్, అర్బన్ మండలపార్టీ ఆధ్వర్యంలో, చిన్న కోడూరు మండల కేంద్రంలో, నంగునూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో పాలమాకుల వద్ద జాతీయ రహదారిపై, నారాయణ రావు పేట మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో ధర్నా, రాస్తా రోకోలు నిర్వహించారు.
చిన్న కోడూరుతో పాటు నంగునూర్ మండలం పాలమాకుల వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు. వంద మీటర్ల బ్యానర్ ని రంగనాయక సాగర్ పై ప్రదర్శించారు. మెదక్‌జిల్లా కౌడిపల్లిలో నేషనల్ హైవే మీద బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఎస్సై రంజిత్ రెడ్డి సిబ్బందితో చేరుకుని ధర్నా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్శ్రేణులు నల్ల కండువాలు ధరించి నిరసన చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులను, ఎమ్మెల్యే ప్రభాకర్ ను అదుపులోకి తీసుకొని ధర్నాను భగ్నం చేశారు. జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్శ్రేణులు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కేసీఆర్ కు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకను కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జోగిపేట పట్టణంలో బీఆర్ఎస్ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
రాయికోడ్ లోని వీరభద్రేశ్వర కమాన్ సెంటర్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెదక్‌పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులా బయటపడతారన్నారు. పార్టీలో క్రమశిక్షణ తప్పినందుకు బిడ్డ అని కూడా చూడకుండా కవితను సస్పెండ్ చేశారన్నారు.హుస్నాబాద్ పట్టణంలో మల్లెచెట్టు చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను బీఆర్ఎస్శ్రేణులు దహనం చేశారు. కేసీఆర్ పేరు చెడగొట్టడంతో పాటు పార్టీ ముఖ్య నేతల పేర్లను బదనాం చేస్తూ కవిత మాట్లాడడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు.