పద్మారావునగర్, వెలుగు: పరిశ్రమల భూములను ప్రజల అవసరాలకే వినియోగించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిటీలో వేర్వేరు చోట్ల నిరసన తెలిపారు. సనత్‌నగర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో గురువారం ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌తో కలిసి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. వేల కోట్ల విలువైన పరిశ్రమ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ధరలకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సనత్‌నగర్‌లో 87.31 ఎకరాల భూమిని ఎకరానికి 6.31 కోట్లకు ధారాదత్తం చేయడమే ఇందుకు ఉదాహరణ అన్నారు.
మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ చెక్ పోస్ట్ లోని పారిశ్రామిక వాడలో నిర్వహించిన ధర్నాలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ పాలసీ (హీల్డ్) పేరుతో లక్షలాది మంది కార్మికులను రోడ్డున పడేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే ఇక్కడి కార్మికులకు 20 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గండిపేట: కాటేదాన్ పారిశ్రామికవాడలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డితో మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పర్యటించారు. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంపెనీలు పోతే మేము ఏమైపోతామని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. పొల్యూషన్ పెరుగుతుందనుకుంటే ఈ ల్యాండ్ ను హ్యాండ్ ఓవర్ చేసుకోని ప్రజల అవసరాల కోసమే వాడాలని డిమాండ్ చేశారు.
