గులాబీ పార్టీలో గుబులు.. కవిత పీఆర్వోపై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేటు !

గులాబీ పార్టీలో గుబులు.. కవిత పీఆర్వోపై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేటు !

హైదరాబాద్: కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత.. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. సోమవారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ వల్లే.. కేసీఆర్పై సీబీఐ విచారణ వరకు వచ్చిందని.. దీనికంతటికి కారణం వాళ్లే అంటూ కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కు, కవితకు దూరం మరింత పెరిగింది.

కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఇప్పటి వరకు చూసీచూడనట్లు వదిలేసినా.. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ.. తన సోషల్ మీడియా గ్రూప్స్ నుంచి కవిత ఫాలోవర్స్, కవిత పీఆర్వోలను తొలగించింది. వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న కవిత సానుభూతి పరులను తొలగిస్తూ.. సోషల్ మీడియా గ్రూప్స్ అయిన ఎక్స్, ఫేస్ బుక్ అకౌంట్లలో ఉన్న వాళ్లను కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ ఫాలో చేస్తుండటంతో బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం రచ్చకెక్కింది.

కవిత తన ప్రెస్ మీట్ లో హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హరీష్ రావు, సంతోష్ అవినీతి అనకొండలు అని, ఈ ఇద్దరి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నడని, కేసీఆర్కు అవినీతి మరక అంటడానికి కారణం హరీష్ రావు అని కవిత సంచలన ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యల తర్వాత.. అధిష్టానం ఆదేశించిందో లేక బీఆర్ఎస్లోని హరీష్ రావు వర్గం ఆగ్రహించిందో తెలియదు గానీ కొన్ని కీలక పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి.

బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూపుల నుంచి కవితను తొలగించడం, హరీష్ రావుకు అండగా నిలుస్తున్నామనే విధంగా బీఆర్ఎస్ ‘ఎక్స్’ ఖాతాలో హరీష్ ను సింహంతో పోల్చుతూ వీడియో పోస్ట్ చేయడం.. ఇలా చాలా జరిగిపోయాయి. బీఆర్ఎస్లో ఈ పరిణామాలను తెలంగాణ రాజకీయ వర్గాలు ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి.