- షరీఫ్ ఒస్మాన్ హాదీ మద్దతుదారుల భారీ ర్యాలీ
- భారత్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు
- హదీని హత్య చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్
ఢాకా/న్యూఢిల్లీ,/కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో మరోసారి భారత్కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఢాకా యూనివర్సిటీలో ఇంక్విలాబ్ మంచో నాయకుడు షరీఫ్ ఒస్మాన్ హాదీ మద్దతుదారులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో భారత్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ నెల ప్రారంభంలో హాదీ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి బంగ్లాదేశ్వ్యాప్తంగా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. కాగా, శుక్రవారం ర్యాలీలో నిరసనకారులు హాదీకి మద్దతుగా నినాదాలు చేశారు. "ఐ యామ్ హాదీ" అంటూ నినాదాలు చేస్తూ.. హదీ హత్యపై వేగవంతమైన విచారణ జరపాలని, హంతకులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 12న శుక్రవారం ప్రార్థనల అనంతరం హాదీ రిక్షాలో వెళ్తుండగా ముసుగు ధరించిన దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. అనంతరం ఆయన సింగపూర్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్పొందుతూ ఈ నెల 18న మరణించాడు. అయితే, హాదీ హంతకులు భారత్‌లో ఆశ్రయం పొందారని కొంతమంది నిరసనకారులు ఆరోపిస్తున్నారు.
ఢాకా ఈ హంతకులను అరెస్టు చేయడానికి భారత్ సహాయం కోరినా.. న్యూఢిల్లీ ఈ ఆరోపణలను తీవ్రంగా తోసిపుచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. కాగా, బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరిలో జరగనున్న సాధారణ ఎన్నికలకు ముందు ఈ ఉద్రిక్తతలు ముహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి కొత్త సవాలుగా మారాయి.
మైనారిటీలపై దాడులు ఆందోళనకరం: భారత్
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ హయాంలో మైనారిటీలపై 2,900 కంటే ఎక్కువ హింసాత్మక ఘటనలు జరిగాయ ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ ఘటనలను మీడియా అతిశయోక్తి లేదా రాజకీయ హింసగా తోసిపుచ్చలేమన్నారు.
ఆ దేశంలో రాబోయే పార్లమెంటు ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయబద్ధంగా జరగాలని ఆశిస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు బంగ్లాదే శ్‌లో పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలి స్తోందని తెలిపారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లోని హోటల్స్ ఓనర్ల సంఘం సిలిగురితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బంగ్లాదేశీయులకు వసతి కల్పించడాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు గ్రేటర్ సిలిగురి హోటళ్ల సంక్షేమ సంఘం ప్రకటన జారీ చేసింది. టూరిస్టులతో పాటు తమ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
