ముదిరాజ్‌‌లకు టికెట్లివ్వని బీఆర్‌‌‌‌ఎస్‌‌కు బుద్ధి చెప్పాలి : విశారదన్ మహరాజ్

ముదిరాజ్‌‌లకు టికెట్లివ్వని  బీఆర్‌‌‌‌ఎస్‌‌కు బుద్ధి చెప్పాలి :  విశారదన్ మహరాజ్

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: అణగారిన వర్గాల ప్రజలకు రాజకీయంగా అవకాశం కల్పించకుండా పాలకులు కేవలం ఓటు బ్యాంక్‌‌గానే వాడుకుంటున్నారని ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌లో ముదిరాజ్ చైతన్య వేదిక చైర్మన్‌‌ శివ ముదిరాజ్‌‌ అధ్యక్షతన జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షలకు పైగా జనాభా ఉన్న ముదిరాజ్‌‌లకు బీఆర్ఎస్ పార్టీ ఒక్క అసెంబ్లీ టికెట్‌‌ కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. 

అధికార పార్టీ చేసిన అవమానానికి ముదిరాజ్‌‌లు ఆత్మగౌరవంతో రాజ్యాన్ని పాలించే దిశగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ముదిరాజ్ చైతన్య వేదిక చైర్మన్ శివ ముదిరాజ్ మాట్లాడుతూ.. తమకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు కేటాయించిన పార్టీకే ముదిరాజ్‌‌ల మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. పండగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం.. పోలీస్ కృష్ణన్న, నెల్లి లక్ష్మీనారాయణ జయంతి, వర్ధంతిలను కూడా అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ చైతన్య వేదిక నాయకులు, సీతాఫల్​మండి కార్పొరేటర్ శ్యామల హేమ, బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ చెన్న రాములు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.