బీఆర్ఎస్ ను గద్దె దింపాలి: విజయశాంతి

బీఆర్ఎస్ ను గద్దె దింపాలి: విజయశాంతి
  • ప్రతి పథకంలోనూ అవినీతికి పాల్పడింది

సారంగాపూర్/నర్సాపూర్, వెలుగు : సీఎం కేసీఆర్  చేస్తున్న అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్  నాయకురాలు విజయశాంతి అన్నారు. శనివారం నిర్మల్​ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు బీరవెల్లి, దిలావర్పూర్  మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్  పాలనలో తెలంగాణ ప్రజానీకాన్ని ప్రభుత్వం వెర్రివాళ్లని చేసిందని, కేసీఆర్  కుటుంబ సభ్యులు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని మండిపడ్డారు. అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ‘‘కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోనూ అవినీతి జరిగింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి దాంట్లోనూ కమీషన్లకు కక్కుర్తిపడ్డారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్  రెడ్డి నిర్మల్ లో భూకబ్జాలు చేశాడు. చెరువులను కూడా మింగేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టు, హరితహారం పథకంలో కోట్లు తిన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్  తిన్న అవినీతి సొమ్మును మొత్తం బయటకు తీసి ప్రజానీకానికి పంచుతాం” అని విజయ శాంతి పేర్కొన్నారు. కాంగ్రెస్  ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ నేతగా గత 15 సంవత్సరాలుగా ఎలాంటి అధికారం లేకున్నా ప్రజాసేవే లక్ష్యంతో ప్రజల వెంట ఉంటున్న నిర్మల్  కాంగ్రెస్  అభ్యర్థి కుచాడి శ్రీహరి రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

కేంద్రం, రాష్ట్రం రహస్య ఒప్పందం

బాల్కొండ/మల్లాపూర్, వెలుగు : కేంద్ర ప్రభుత్వంతో సీఎం కేసీఆర్  రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని విజయశాంతి ఆరోపించారు. శనివారం నిజామాబాద్ జిల్ల బాల్కొండ మండల కేంద్రం, జగిత్యాల జిల్లా మల్లాపూర్​లో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ తెర వెనుక ఒప్పందం చేసుకున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో దొరికినా ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. కవితను కేంద్రం అరెస్టు చేస్తుందని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారని, కానీ కేసీఆర్ తో కేంద్రం కుమ్మక్కై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫైర్  అయ్యారు. కేసీఆర్  పాలనను గద్దెదించాలని ఓటర్లను కోరారు.  కాంగ్రెస్  పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, భంగపడ్డ తెలంగాణను బాగుచేసుకునేందుకు కాంగ్రెస్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.