ఆదిలాబాద్, బోథ్‌‌‌‌‌‌‌‌లలో ఆశావహుల జోరు.. ఎమ్మెల్యేలకు దీటుగా కార్యక్రమాలు

ఆదిలాబాద్, బోథ్‌‌‌‌‌‌‌‌లలో ఆశావహుల జోరు.. ఎమ్మెల్యేలకు దీటుగా కార్యక్రమాలు

ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల వ్యతిరేక వర్గం,  ఆశావహులు టికెట్​ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. వారి బర్త్ డే ల సందర్భంగా  బల ప్రదర్శన కు సిద్ధమవుతున్నారు.  ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో కొంత కాలంగా ఎమ్మెల్యేలపై పలువురు లీడర్లు అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆశావహులు వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి  వెళ్తున్నారు.  బర్త్ డే వేడుకల్లో తమ బలాన్ని నిరూపించుకుంటున్నారు.  నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ పుట్టిన రోజు వేడుకలను పార్టీ ప్రచార కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించారు.  ఈ సారి తనకే టికెట్​ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు.   ఆదిలాబాద్, బోథ్​ నియోజకవర్గాల్లోనూ టికెట్ ఆశిస్తున్న ఇద్దరు నేతలు వారి బర్త్ డే పార్టీని  వేలాది మంది కార్యకర్తలను మధ్య జరుపుకున్నారు.

ఎమ్మెల్యేల  తీరు.. పార్టీలో కార్యకర్తలు బేజారు

ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగురామన్నకు వ్యతిరేకంగా మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రంగినేని మనీషా ఈ సారి టికెట్ ఆశిస్తున్నారు.  ఇటీవల తన బర్త్ డే వేడుకలను ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే  రాథోడ్ బాపురావు హాజరుకావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. అటు బోథ్ లో అనిల్ జాదవ్ బర్త్ డే వేడుకలకు ఎమ్మెల్యే జోగురామన్న, జడ్పీ చైర్మెన్ రాథోడ్ జనార్ధన్  హాజరయ్యారు. అనిల్ జాదవ్ కు మంచి భవిష్యత్ ఉందని, అధిష్టానం ఆలోచిస్తుందంటూ రామన్న పేర్కొనడంతో  ఇది బోథ్  నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఇటు ఎమ్మెల్యే రామన్న, బోథ్ ఎమ్మెల్యే బాపురావును టార్గెట్ చేసినట్లు భావిస్తుండగా.. అటు బాపురావు సైతం రామన్న వ్యతిరేక వర్గంగా ఉన్న రంగినేని మనీషాకు మద్దతు తెలుపుతుండటం చర్చనీయాంశంగా మారింది. టికెట్ ఆశించిన వారే కాకుండా ఇతర జడ్పీటీసీ, ఎంపీపీలు, సీనియర్ లీడర్లు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొరకరానికి కొయ్యగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఒక పక్క ఎన్నికలు దగ్గరపడుతుంటే ఇప్పుడు టికెట్ల లొల్లితో ప్రజల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని సీనియర్లు అంటున్నారు. 

విభేదాలు తారాస్థాయికి 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య  వివాదం ఒక్కొక్కటి గా బయటపడుతోంది. పార్టీలో వర్గ విభేదాలు లేకుండా అందరిని కలుపుకుపోవడంలో పార్టీ జిల్లా అధ్యక్షుల బాధ్యత.  ఇక్కడ తమ పార్టీ ఎమ్మెల్యే లకు వ్యతిరేకంగా ఉన్న వారినే ప్రోత్సహిస్తుండటంతో పార్టీ పరువు తీస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.  పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను  ఎమ్మెల్యేలు, వ్యతిరేక వర్గాలు ఎవరికి వారే నిర్వహిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో బీఆర్ఎస్ వర్గ పోరు ఎక్కడికి దారికి తీస్తుందోననే చర్చ జోరుగా సాగుతోంది.  ప్రతి పక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గడపగడపకు కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నాయి. ప్రతి పక్ష పార్టీలో టికెట్ల పోటీ కాకుండా ముందుగా ప్రజల్లోకి వెళ్లాలంటూ అధిష్టానాల ఆదేశాలతో కొన్ని రోజులుగా విస్త్రత కార్యక్రమాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ లో మాత్రం ప్రభుత్వ పథకాల ప్రచారం కంటే ఎమ్మెల్యే టికెట్ల పంచాయితీ  ఎక్కవైందనే వాదనలు వినిపిస్తున్నాయి.