- కత్తికార్తీకను అభినందించిన ఎమ్మెల్యే హరీశ్ రావు
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పది నెలలైనా హామీలు అమలేదీ
దుబ్బాక, వెలుగు: గర్భిణులకు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక సొంత నిధులతో సీమంతం కానుకలను అందజేయడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం దుబ్బాకలో కత్తి కార్తీక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గర్భిణీలకు మా ఇంటి మహాలక్ష్మి సీమంతం కానుకలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమంతం కానుకలను చూస్తుంటే గతంలో పింపిణీ చేసిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు గుర్తుకొస్తున్నాయన్నారు. తల్లిబిడ్డలు క్షేమంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్లను కేసీఆర్ ప్రభుత్వం అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంద్ చేసిందని ఆరోపించారు. కేసీఆర్ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి నచ్చకపోతే పథకాల పేర్లను మార్చి పేద ప్రజలకు, గర్భిణీలకు అందజేయాలని డిమాండ్ చేశారు.
సర్కారొచ్చి పదినెలలైనా హామీల అమలేదీ
కాంగ్రెస్ సర్కారొచ్చి పది నెలలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కల్యాణలక్ష్మి పథకంలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న తులం బంగారం ఎక్కడ పోయిందన్నారు. వానాకాలం తుది దశకు చేరుతున్నా రుణమాఫీ కాకపోవడం, రైతు బంధు రాక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నెల నుంచే రూ. 4 వేల ఫించన్ ఇస్తున్నారని, తెలంగాణలోని ప్రజలు ఏమి పాపం చేసుకున్నారన్నారు.
నిరుద్యోగులకు రూ. 5 లక్షల భరోసా కార్డు ఎటుపోయిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చకపోవడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిజ స్వరూపం బయట పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితా, పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కైలాస్, బీఆర్‌ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి, గుండెళ్లి ఎల్లారెడ్డి, కౌన్సిలర్లు ఆస యాదగిరి, పల్లె మీణా రామస్వామి గౌడ్, ఇల్లెందుల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సూకూరి లింగం తదితరులు పాల్గొన్నారు.