- మళ్లీ గెలుస్తమని నమ్మకముంటే..
- ప్రజా తీర్పు ఎట్లుంటదో చూద్దాం: కేటీఆర్
- రేవంత్.. కలలు కనండిగానీ కథలు చెప్పకండి
- 9 రోజులు నిందితుడిని కాపాడిన ఉదంతం దేశంలో ఎక్కడా లేదేమో
- మీడియా కాళ్లా వేళ్లా పడి సంజయ్ కొడుకు వార్త రాకుండా చేశారు
- ఆ వార్తలు ఇవ్వనందుకు తెలుగు మీడియా సిగ్గుపడాలి
- హనీట్రాప్ అంటూ వెధవ మీడియాలో కథనాలు వచ్చినయ్
- రాష్ట్రంలో 30 శాతం ధాన్యం కూడా కొనలేదని ఫైర్
- గన్నీ బ్యాగులు దొరకట్లేదుగానీ.. గన్నులు దొరుకుతున్నాయని కామెంట్
హైదరాబాద్, వెలుగు: 2034 దాకా సీఎంగా తానే ఉంటానని పగటి కలలు కంటున్న రేవంత్, దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ సవాల్ విసిరారు. ‘‘రేవంత్.. కలలు కనండి కానీ కథలు చెప్పకండి. పిట్టకథలు.. లొట్టకథలు బాగానే చెప్పి అధికారంలోకి వచ్చిండు. 2034 దాకా సీఎంగా ఉంట అంటున్నడు. అంత నమ్మకమే ఉంటే.. దమ్ముంటే ఇప్పుడే అసెంబ్లీ రద్దు చెయ్యి.. మేము కూడా మా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తం.. ప్రజాతీర్పు ఎలా వస్తుందో చూస్తం.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతో వ్యతిరేకత ఉన్నది’’ అని పేర్కొన్నారు. రేవంత్ లాంటి ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అది ఫ్యూచర్ సిటీ కాదని, ఫార్మా సిటీ అని పేర్కొన్నారు. ‘దేశంలో ప్రధాన ప్రతిపక్షం లేదు.. అందుకే కాంగ్రెస్ కన్నా కాక్ రోచ్ లే నయమని భావిస్తున్నారేమో’ అంటూ ఎద్దేవా చేశారు.
నిందితుడిని కాపాడిన్రు
అన్యాయం జరిగిందని ఒక ఆడబిడ్డ బయటకొస్తే.. ఆ కుటుంబాన్ని బెదిరించి కౌంటర్ కేసు పెట్టించి నిందితుడిని సంజయ్, రేవంత్ 9 రోజులు కాపాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మైనర్ తనకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులతో పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అర్ధరాత్రి వరకు నిలబెట్టి తీవ్ర ఆవేదనకు గురిచేసింది ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. హైకోర్టు బెయిల్ ఇవ్వనని తెగేసి చెప్పడం, తెలంగాణలోని ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం వల్లే సిగ్గు తెచ్చుకొని, దిక్కులేని పరిస్థితుల్లో నిందితుడిని అరెస్ట్ చేశారన్నారు. పోక్సో కేసు నమోదైన నిందితుడిని 9 రోజులు దాచిపెట్టిన ఉదంతం దేశంలో ఎక్కడైనా ఉందా అని నిలదీశారు. రాష్ట్ర హోంశాఖకు బాధ్యుడిగా ఉన్న సీఎం.. ప్రధాని పర్యటన వల్ల పోలీసులంతా బిజీగా ఉన్నారని అడ్డగోలు సాకులు చెప్పడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని మండిపడ్డారు. సీఎం సన్నిహితుడికి చెందిన ఓ ఆసుపత్రిలోని 28వ అంతస్తులో దాచిపెట్టారని వార్తలు వస్తున్నాయని, దానిపై ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
వెధవ మీడియా..
సంజయ్ కొడుకు వ్యవహారంపై ఒక్క మీడియా సంస్థ కూడా చిన్న స్క్రోలింగ్ వేయలేదని కేటీఆర్ ఆరోపించారు. జాతీయ మీడియాలో వార్తలు వచ్చేదాకా నాలుగైదు రోజలు తెలుగు మీడియా స్పందించలేదని విమర్శించారు. ఈ విషయంలో తెలుగు మీడియా సంస్థలు సిగ్గుపడాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ బ్రదర్స్ కలిసి మీడియా సంస్థలకు ఫోన్ చేసి కాళ్లావేళ్లా పడి వార్తలు రాకుండా ఆపలేదా అని ప్రశ్నించారు. అమ్మాయిపై అఘాయిత్యం జరిగితే హనీ ట్రాప్ అని వార్తలు రాశారని, ఆ రాసిన వెధవ మీడియాలు ఏవో అందరికీ తెలుసని తీవ్రపదజాలం ప్రయోగించారు. నిందితుడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకిస్తున్నారని నిలదీశారు. బండి సంజయ్.. కొడుకు చేసిన వ్యవహారంలో తనకు సంబంధం లేదని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నారని, అంతటి దుర్మార్గమైన పరిస్థితి ఏ తండ్రికి రావద్దన్నారు. కేసులో తన కొడుకుకు, తనకు సంబంధం లేదని చెప్తున్న బండి సంజయ్.. తానే పోలీసులుకు తన కొడుకును అప్పజెప్పానని అనడం ఏంటో అని ఎద్దేవా చేశారు. సంజయ్‌లాగా తన కొడుకుకీ, తండ్రికీ సంబంధం లేదని చెప్పుకునే పిరికివాడిని కాదన్నారు. తన తండ్రి పేరు కేసీఆర్.. కొడుకు పేరు హిమాన్షు అంటూ పేర్కొన్నారు. పోక్సో కేసు విషయం మాట్లాడితే.. తన బామ్మర్ది ఇంట్లో డ్రగ్స్ దొరికాయని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దొరికితే కేసు పెట్టాలని సవాల్ విసిరారు. రేవంత్, మోదీ తోడు దొంగలని చెప్పేందుకు సంజయ్ కొడుకు ఉదంతమే ఉదాహరణ అన్నారు.
ధాన్యం సంచుల మీద ధ్యాస పెట్టు..
సీఎం రేవంత్‌కు డబ్బు సంచుల మీదున్న ధ్యాస.. ధాన్యం సంచుల మీద లేదని కేటీఆర్ అన్నారు. రైతులు చనిపోలేదంటూ మంత్రి ఉత్తమ్ దారుణంగా మాట్లాడారన్నారు. ఆయన సొంత జిల్లా సూర్యాపేటలోనే ఒక రైతు ధాన్యం కుప్పల మీద చనిపోయిండని గుర్తు చేశారు. ‘‘మంచిర్యాల జిల్లాలో ఒకే రోజు నలుగురు రైతులు చనిపోయారు. ధాన్యం కొంటలేరని ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. 45 డిగ్రీల వేడిలో 45 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలో 30 శాతం కూడా ధాన్యం కొనలేదు. రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరకట్లేదుగానే గన్నులు దొరుకుతున్నాయి. పట్టపగలే కరీంనగర్లో బంగారం షాపులో బందిపోట్లు లూటీ చేశారు. రైతు సంక్షోభాన్ని గుర్తించకుండా సీఎం అనవసర కామెంట్స్ చేస్తున్నారు. పంట కొనుగోళ్లపై చర్చకు ఎక్కడికైనా వస్తం.. కొడంగల్ కే వెళ్దాం. ప్రధాని మోదీ వచ్చి.. ఎరువులు వాడొద్దు, బంగారం కొనుద్దు అని చెప్పి పోయిండు తప్ప రైతులకు ఏమీ చేయలేదు. కాంగ్రెస్ ఉన్నంత కాలం పంట కొనుగోళ్లు జరగవ్. భూ భారతి పేరిట భూ స్వాహా చేస్తున్నారు. కేబినెట్ మీటింగ్‌లో ధాన్యం కొనుగోళ్లపైనే చర్చ జరగాలి. సింగిల్ పాయింట్ ఎజెండాగా మీటింగ్ జరగాలి. ప్రభుత్వం ఏ పంట ఎంత కొన్నదో శ్వేతపత్రం విడుదల చెయ్యాలి’’ అని డిమాండ్ చేశారు.
గల్ఫ్‌కు వెళ్లిన వాళ్ల ఓట్లు పోనివ్వం
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేం దుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. త్వరలో రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో గల్ఫ్‌కు వెళ్లిన వారి ఓట్లు తొలగిం చకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జుల సమావేశంలో సీనియర్ నేతలతో సమీక్ష చేశారు. గల్ఫ్‌కు వెళ్లిన వాళ్ల ఓట్లు తొల గించకుండా పార్టీ తరఫున ఒక సీనియర్ ప్రతినిధి, నాయకుల ప్రతినిధి బృందాన్ని, ఎమ్మెల్యేలు, ఎంపీల బృందాన్ని ఢిల్లీకి పంపు తామన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా తమకు కేటాయించిన బూత్‌ల పరిధిలో గల్ఫ్ ఎన్ఆర్ఐల వివరాలు సేకరించి వారి ఓటు హక్కును ఎలక్షన్ కమిషన్ తొలగించకుండా సమన్వయం చేసుకోవాలని సూచించారు.
