
- పదేండ్లలో మస్తు పనులు చేసినం: కేటీఆర్
- రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కూ ఇదే పరిస్థితి వస్తది
- పార్టీ మారిన ఎమ్మెల్యేల
- పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక లెక్కయిందని కామెంట్
- తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘పదేండ్లలో రాష్ట్రాన్ని మస్తు డెవలప్ చేసినం. కానీ మార్కెటింగ్ చేసుకోలేకపోయినం. మా సీఎం (కేసీఆర్) చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేసుకోలేకపోయినం. అందుకే ఎన్నికల్లో ఓడిపోయినం. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది” అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం నీళ్లే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయని, హైదరాబాద్ తాగునీటి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు కూడా కాళేశ్వరం నీళ్లే వస్తాయని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17 సందర్భంగా బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో కేటీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థులకు చెందిన పలు కుటుంబాలను ప్రభుత్వం తమపై ఎగదోస్తున్నదని అన్నారు. ‘‘గ్రూప్-1 పరీక్షలో జరిగిన అవకతవకలను హైకోర్టు గుర్తించింది. అభ్యర్థులకు జరిగిన నష్టాన్ని కూడా బయటపెట్టింది. ఒక్కో పోస్టును రూ.3 కోట్లకు అమ్ముకున్నారని అభ్యర్థులే చెబుతున్నారు. ఏ మంత్రి డబ్బులు తీసుకున్నారో అభ్యర్థులనే అడగండి. ఆ మంత్రి పేరు కూడా అభ్యర్థులు చెప్పారు. ఈ విషయంలో ఎవరికైనా ఇబ్బందులుంటే హైకోర్టును ఆశ్రయించవచ్చు” అని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో పాలన స్తంభించింది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. బిల్లులు చెల్లించక ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు రద్దయ్యాయి” అని అన్నారు.
ప్రైవేట్ కంపెనీలు పోతున్నయ్..
ప్రభుత్వ దుర్మార్గపు చర్యలతో ప్రైవేట్ కంపెనీలు వెళ్లిపోతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘ముడుపుల కోసం ప్రైవేట్ కంపెనీలను ప్రభుత్వం వేధిస్తున్నది. సర్కార్ బెదిరింపుల కారణంగానే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ సంస్థ వైదొలుగుతున్నది” అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉందని, వాళ్ల విధానాలను చెప్పి ప్రజల్లోకి వెళ్లవచ్చన్నారు.
తాము బతుకమ్మ చీరలు అందరికీ ఇచ్చామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొందరికే ఇస్తున్నదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బంధుప్రీతి లేదని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని.. మరి సుజన్ రెడ్డి, అమిత్ రెడ్డికి రూ.వందల కోట్ల కాంట్రాక్టులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికినా సీఎంకు సమాచారం కూడా లేదన్నారు. హైడ్రా కాస్త హైడ్రామాగా మారిందనిన్నారు.
దమ్ముంటే ఉప ఎన్నికలు పెట్టండి
పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక లెక్క తయారైందని కేటీఆర్ అన్నారు. స్పీకర్‌ను ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు. సర్కార్‌కు దమ్ముంటే వెంటనే ఉప ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకుల పరిస్థితి చూస్తే జాలి కలుగుతోందన్నారు. ‘‘మా హయాంలోనే ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ రూపొందించాం.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సొంత ప్రయోజనాల కోసం దాన్ని మార్చుతున్నది. దీంతో వేలాది మంది రైతులు భూములు కోల్పోయే పరిస్థితి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి కుటుంబసభ్యుల భూముల కోసమే ట్రిపుల్ ఆర్, ఫోర్త్ సిటీ మధ్య రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డు వెంబడి అనేక మంది భూములు కొనుగోలు చేసి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారు” అని చెప్పారు.