బిర్యానీకి ఆశపడి.. జనం అన్నం పోగొట్టుకున్నరు: కేటీఆర్

బిర్యానీకి ఆశపడి.. జనం అన్నం పోగొట్టుకున్నరు: కేటీఆర్
  • తప్పు చేసి ఐదేండ్ల శిక్ష అనుభవిస్తున్నరు: కేటీఆర్​
  • అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ హామీలకు జనం మోసపోయారు
  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్​కు 100 సీట్లు
  • లోకేశ్​ చదువుకున్నోడు.. నాకు మంచి మిత్రుడు
  • అతన్ని కలవలేదు.. అయినా కలిస్తే తప్పేంటి? అని ప్రశ్న


ఖమ్మం, వెలుగు: రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ బిర్యానీ పెడతదని ఆశపడి.. కేసీఆర్ పెట్టే అన్నాన్ని పోగొట్టుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేండ్లు నిర్మాణాత్మకంగా పని చేశామని, మొన్నటి ఎన్నికల్లో రాహుల్ గాంధీని పిలిపించి.. నోటికొచ్చిన బోగస్ మాటలు చెప్పి కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిందన్నారు.  శుక్రవారం ఖమ్మంలో పర్యటించారు. ముందుగా మమత కాలేజీ ఆవరణలో ఖమ్మం నగర బీఆర్ఎస్​ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆ తర్వాత బీఆర్ఎస్​ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో  కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్​ హామీలను  బలహీన వర్గాల సోదరులు నమ్మి గెలిపించారని తెలిపారు.  ఒక్క తప్పు ఓటు వేసినందుకు 5 ఏండ్లు శిక్ష పడుతుందని అప్పుడు వారికి అర్ధం కాలేదు’ అని కేటీఆర్​ అన్నారు.  ఖమ్మం జిల్లాలో  ముగ్గురు మంత్రులు ముగ్గురు మొనగాళ్ల లాగా తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. అందులో ఒకరు బాంబుల మంత్రి అని,  ఇంకోకాయన కమీషన్ల మంత్రికి అన్న  పేరుందన్నారు.     ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ కాటేసి కాటికి పంపుతుందన్న నిజం తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థాయిలో గెలుపొందాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.  

లోకేశ్ ను కలిస్తే తప్పేంటి? 

ఏపీకి చెందిన మంత్రి నారా లోకేశ్ ను తాను కలవలేదని, అయినా కలిస్తే తప్పేంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన పక్క రాష్ట్ర మంత్రి అని, తనకు మంచి స్నేహితుడని చెప్పారు. తాను అర్ధరాత్రి లోకేశ్ ను కలిసినట్టు సీఎం రేవంత్ ఢిల్లీలో చేసిన చిట్ చాట్ లో చెప్పారని.. ఆయన మీ పెద్ద బాస్​ కొడుకే కదా, ఏమైనా దావూద్ ఇబ్రహీంను కలిశానా అని నిలదీశారు.  ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టేందుకు హెడ్ లైన్లు, డెడ్ లైన్ల పేరుతో మీడియాను రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఆంధ్ర వాళ్లు పెట్టారు దానికి నేను రాను అని ముందురోజు రేవంత్ అన్నారు. 24 గంటల్లో ఏమి జరిగిందో తెలీదు, తెల్లారి డిల్లీలో తేలిండు. బనకచర్ల గురించి సమావేశంలో ఏమి మాట్లాడలేదు అన్నాడు. ఆంధ్ర మంత్రేమో ఎజెండాలో  బనకచర్ల అంశం ఉందని   మాట్లాడిండు. బనకచర్ల పేరుతో బాబుగారికి రేవంత్ గురుదక్షిణ చెల్లించడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

 మిగులు జలాల్లో వాడుకుంటే ఇబ్బందేంటని చంద్రబాబు అంటున్నారు. 1,86 టీఎంసీల నికర జలాల్లో 968 టీఎంసీలు తెలంగాణ వాటా అని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రానికి మేం స్పష్టంగా చెప్పాం. మిగులు జలాలు 3 వేల టీఎంసీలు అదే దామాషా ప్రకారం 1950 టీఎంసీలు తెలంగాణకు రావాలి. దీనిపై ముందు కేంద్రాన్ని ఒప్పించండి. చంద్రబాబు చేతుల్లో ఇప్పుడు కేంద్రం ఉంది. కేంద్రం ముందుకువచ్చి మిగులు, నికర జలాల్లో తెలంగాణ వాటాను ప్రకటించడంతో పాటు సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్​, కాళేశ్వరం ప్రాజెక్టులపై గతంలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతూ కేంద్రానికి రాసిన లేఖలను  ఉపసంహరించుకున్న తర్వాతనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. బనకచర్లకు గోదావరి రివర్​ మేనేజ్​ మెంట్ బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్ వాటర్​ కమిషన్​, అపెక్స్​ కౌన్సిల్ అనుమతులున్నాయా’’ అని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా బనకచర్ల ప్రాజెక్టును  కట్టుకుంటామంటే ఒప్పుకునేది లేదని   అన్నారు. 

భట్టి, పొంగులేటి, ఉత్తమ్ ఫోన్లు ట్యాప్​ చేస్తున్నరు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్​ చేస్తున్నారని కేటీఆర్​ ఆరోపించారు. ‘‘నీ సీటుకు ఎవరు ఎసరు పెడుతారో అని చెప్పి భట్టి విక్రమార్క, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేయడం లేదని నువ్వు మీ మనవడి మీద ఒట్టు వేసి చెప్తావా రేవంత్. రాష్ట్రంలో వేలాది మంది ఫోన్లు ట్యా ప్ చేయడం లేదా? ట్యాప్​ చేయడం లేదని లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా?” అని- కేటీఆర్ ప్రశ్నించారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోందని,  42 శాతం రిజర్వేషన్ల పేరిట  ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమని స్తున్నారని అన్నారు.  ఏడేండ్లలో  బీసీలకు రూ.లక్ష కోట్ల బడ్జెట్ అన్నారని,  కనీసం 10వేల కోట్లివ్వలేదన్నారు. బీసీ సబ్​ ప్లాన్​ ఎటుపోయిందని నిలదీశారు.  ఆర్డినెన్స్​ చెల్లదని ప్రజలందరికీ అర్ధమవుతున్నద న్నారు.