
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీకి సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికే కంటోన్మెంట్‌ను కోల్పోయిన ఆ పార్టీ, ఎట్టిపరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్‌ను కోల్పోవద్దనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే మిగతా అన్ని పార్టీల కన్నా ముందుగానే అభ్యర్థిని ప్రకటించి, ప్రచారం ప్రారంభించింది.
సెంటిమెంట్కూడా కలిసివస్తుందనే ఉద్దేశంతో మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే గులాబీ పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించింది. టికెట్ ఖాయం కాకముందే గోపీనాథ్ ఇద్దరు కూతుర్లు అక్షర, దిశిర నియోజకవర్గంలోని డివిజన్లలో ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. అభ్యర్థిని ప్రకటించాక లీడర్లతోపాటు కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు.
ఈ ఉప ఎన్నిక గెలుపు బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజానికెత్తుకున్నారు. డివిజన్ల వారీగా సిటీ ఎమ్మెల్యేలకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. కేడర్‌తో భేటీ అవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడంతో వారి ఓట్లు పడేలా మైనారిటీ నేతలతోనూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
‘కాంగ్రెస్ బాకీ కార్డ్’ పేరుతో ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ప్రజల్లోకి వెళ్తున్నారు. రెండు మూడు రోజుల కింద ఎమ్మెల్యే హరీశ్ రావు యూసుఫ్ గూడ డివిజన్ లో బైక్ ర్యాలీ తీసిన అనంతరం ఇంటింటికీ బాకీ కార్డులను పంచారు.