గులాబీ నేత.. ఇసుక మేత..! దందాతో యువనేత రూ. కోట్లలో సంపాదన

గులాబీ నేత.. ఇసుక మేత..! దందాతో యువనేత రూ. కోట్లలో సంపాదన

మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిర్యాల జిల్లా చెన్నూర్ సెగ్మెంట్‎లో యువ నేత ఇసుక దందాతో జీరో నుంచి రూ. కోట్లకు పడగలెత్తారు. కొల్లూరు గోదావరి క్వారీల నుంచి అడ్డు అదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినట్టు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ యువ నేతతో పాటు ప్రధాన అనుచరులు కొందరు ఇసుక దందాతో రూ. కోట్లలో ఆస్తులు కూడబెట్టుకున్నారని గులాబీ క్యాడర్‎లోనూ జోరుగా చర్చ జరుగుతోంది.  గత ఎన్నికల్లో ప్రతిపక్షాలు సైతం అతని అక్రమార్జనపైనే తీవ్ర ఆరోపణలు  లేవనెత్తాయి. అయితే తమను రాజకీయంగా దెబ్బతీయడానికే విమర్శలు చేస్తున్నట్టు ఆ పార్టీ లీడర్లు కొట్టిపారే శారు. కానీ, తాజాగా ఆ పార్టీలో తెరపైకి వచ్చిన ‘ఇసుక పంచాయితీ’ ద్వారా పై ఆరోపణలకు బలం చేకూరింది.  

ఇదీ పంచాయితీ..

బీఆర్ఎస్ హయాంలో జిల్లాలో చక్రం తప్పిన యువ నేత ప్రధాన అనుచరుడు, కోటపల్లి మండలానికి చెందిన చోటా లీడర్ హవా నడిచింది. యువ నేత పేరు చెప్పి కొల్లూరు క్వారీల నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా చేశాడని, రేషన్ బియ్యం, లిక్కర్ దందాలోనూ ఆయనదే ప్రధాన పాత్ర అని, మంచిర్యాలలోనూ ల్యాండ్ సెటిల్ మెంట్లు చేశాడనే ఆరోపణలు వినిపించాయి. 

బీఆర్ఎస్ పవర్ కోల్పోయి రెండేండ్లవుతున్నా, నేటికీ ఆ పార్టీ వర్గాల్లో ఆయన గురించి చర్చ కొనసాగుతూనే ఉంది. నమ్మిన వ్యక్తి తనను బాగా వాడుకుని, బద్నామ్ చేశాడనే అక్కసుతో ఉన్న యువ నేత ఇటీవల కొందరు అనుచరుల ద్వారా సదరు లీడర్ దందాలపై ఆరా తీసినట్టు సమాచారం. కొల్లూరు క్వారీల నుంచి రోజుకు ఇరవై లారీల జీరో ట్రిప్పులు కొట్టేవాడని, ల్యాండ్ సెటిల్ మెంట్లు కూడా చేసినట్టు తెలిసి యువ నేత ఆగ్రహంతో ఉన్నాడని పలువురు చర్చించుకుంటున్నారు. 

మొత్తంగా తన అనుచరుడు రూ.30 కోట్లకుపైగా వెనకేసుకున్నాడని లెక్కతేల్చినట్టు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంచిర్యాల శివారులోని తన ఇంటిని అమ్మకానికి పెట్టి జిల్లా కేంద్రంలోని అనుచరుడి ఇంటిని తన పేరిట రాయించుకోవాలని యత్నించి, ఆ తర్వాత వెనక్కి తగ్గాడని కూడా క్యాడర్ లో చర్చ నడుస్తోంది.

 ఒకప్పుడు రెంట్ రూమ్ నుంచి..

కోటపల్లి మండలానికి చెందిన సదరు లీడర్‎కు పదేండ్ల కింద పెద్దగా ఆస్తిపాస్తులేవీ లేవు. అతను ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన చాణక్యం ప్రదర్శించాడు. దీంతో చెన్నూర్‎లో  ఆయన హవాకు అడ్డులేకుండా పోయింది. ఇసుక అక్రమ రవాణా, మహారాష్ర్టకు రేషన్ బియ్యం, లిక్కర్ సప్లైతో పాటు ల్యాండ్ సెటిల్ మెంట్ల ద్వారా ఎవరూ ఊహించనంతగా సంపాదించాడు. ఒకప్పుడు మంచిర్యాలలో సింగిల్ రూమ్‎లో రెంట్‎కు  ఉండే స్థాయి నుంచి ఏడెనిమిది ఏండ్లలోనే కోట్ల విలువైన ఇండ్లు, ఖరీదైన కార్లు, ఓపెన్ ప్లాట్లు, భూములు సంపాదించుకున్నాడని సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. 

మంచిర్యాల రాజీవ్ నగర్ శివారులో ఓ ల్యాండ్ సెటిల్ మెంట్ చేసినందుకు ఎకరం భూమి తీసుకున్నాడని తెలిసింది. తాను వైన్ షాపులు, వ్యాపారాల ద్వారా సంపాదించుకున్నానని చెప్తున్నా కానీ.. ఆయన మాటలు ఎవరూ నమ్మడం లేదు. సదరు నేత గతంలో ఆఫీసర్లను మేనేజ్ చేసి ఎస్సారెస్పీ భూనిర్వాసితుడి పేరిట నస్పూర్‏లో కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కొట్టేశాడనే ఆరోపణలు ఉన్నాయి.