బాలికపై బీఆర్ఎస్​ లీడర్ ​అత్యాచారం

బాలికపై బీఆర్ఎస్​ లీడర్ ​అత్యాచారం


భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో బీఆర్ఎస్​యువజన నాయకుడు సెటిల్​మెంట్​సత్తి అలియాస్​  కె.సతీశ్​కుమార్ ​గురువారం ఉదయం ఓ బాలికను ట్రాప్​చేసి బ్రిడ్జి పాయింట్​లోని ఓ లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. లాడ్జీలోకి తీసుకెళ్తుండగా కొందరు చూసి బాలిక కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని సతీశ్​ను చితకబాది పీఎస్​లో అప్పగించారు. ఐద్వా సంఘం మహిళా నేతలు, సీపీఎం లీడర్లు భద్రాచలం పీఎస్​కు చేరుకుని ఆందోళన చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. అధికార పార్టీకి చెందిన యువజన నాయకుడు కావడంతో కేసు కాకుండా ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సోతో పాటు అత్యాచారం కేసు నమోదు చేశామని సీఐ నాగరాజురెడ్డి తెలిపారు.

సతీశ్​ గతంలో ఓ యువతిని పెండ్లి చేసుకోగా ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈ ఘటనలో సతీశ్​పై కేసు నమోదైంది.  ఘటన జరిగిన తర్వాత సోషల్ మీడియాలో సతీశ్​ను కఠినంగా శిక్షించాలని పోస్టింగులు పెట్టడంతో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరికెల తిరుపతిరావు స్పందించారు. సతీశ్​కు పార్టీకి ఇకపై సంబంధం లేదని ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ప్రతిపక్షాలు సతీశ్ ​బీఆర్ఎస్​ లీడర్లతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ ​చేశారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్​కుమార్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్​రేగా కాంతారావుతో దిగిన ఫొటోలను వైరల్​ చేశారు.