సీఎం పదవి వదులుకోవడానికి రెడీ.. నాకు పార్టీయే ముఖ్యం

సీఎం పదవి వదులుకోవడానికి రెడీ.. నాకు పార్టీయే ముఖ్యం

బెంగళూరు: గత కొన్ని వారాలుగా కర్నాటక ముఖ్యమంత్రి మార్పుపై అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సీఎం పదవి నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి యడియూరప్పను దింపి మరొకరిని ఎక్కించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని కన్నడ రాజకీయాల్లో జోరుగా వినబడుతోంది. మరో వారంలో ఈ తంతు ముగుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై తాజాగా యడియూరప్ప స్పందించారు. తనకు సీఎం కుర్చీ ముఖ్యం కాదని, పార్టీ అభివృద్ధే ఎజెండాగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని యడ్డీ స్పష్టం చేశారు.

'మా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోబోతోంది. దీన్ని పురస్కరించుకుని ఈ నెల 26న ఓ కార్యక్రమాన్ని నిర్వించనున్నాం. ఆ తర్వాత పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా నిర్ణయాన్ని బట్టి నేను ముందుకెళ్తా. ఆయన ఏం ఆదేశిస్తే దానికి నేను కట్టుబడి ఉంటా. నేను పవర్ లో ఉన్నా లేకపోయినా బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే నా పని. దీనికి పార్టీ కార్యకర్తలు, నేతలు సహకరించాలి. సీఎం పదవికి సంబంధించి ఆదేశాలు రాగానే దిగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ తర్వాత పార్టీ కోసం కృషి చేస్తా. నాకు ఏ పనులు అప్పజెప్పినా వాటి కోసం చివరి క్షణం వరకు పని చేస్తా' అని యడియూరప్ప పేర్కొన్నారు.