బోర్డర్‌‌లో మరోసారి డ్రోన్ కలకలం

బోర్డర్‌‌లో మరోసారి డ్రోన్ కలకలం
  • పాక్‌ నుంచి పంజాబ్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌

సరిహద్దు ప్రాంతంలో మరోసారి విదేశీ డ్రోన్ కలకలం సృష్టించింది. భారత్, పాక్ సరిహద్దుల్లోని పంజాబ్‌ ఫిరోజ్‌పూర్‌‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి తక్కువ ఎత్తులో ఎగురుతున్న డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్ దళాలు గుర్తించాయి. వెంటనే అప్రమత్తమైన సైనికులు దానిపై కాల్పులు జరిపి కూల్చివేశారు. ఆ డ్రోన్‌ను చైనాలో తయారు చేసినట్టు గుర్తించామని, ఇది పాకిస్థాన్ వైపు నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే ఆ ప్రాంతంలో జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారన్నారు.

కాగా, భారత భూభాగంలోకి డ్రోన్ ప్రవేశించిందన్న విషయం తెలియడంతో బీఎస్‌ఎఫ్ సీనియర్ అధికారులు ఫిరోజ్ పూర్‌‌కు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఏదైనా డేటాను శత్రుదేశానికి పంపిందా? దానిని ఎంత దూరం నుంచి ఆపరేట్ చేసి ఉంటారు? లాంటి విషయాలపై సమీక్షించారని తెలుస్తోంది. గతంలో జమ్మూకశ్మీర్ సరిహద్దుకు పాకిస్థాన్ నుంచి డ్రోన్లు రావడం కలకలం రేపింది. అక్కడ నిఘా పెరగడంతో పాకిస్థాన్ ఇప్పుడు పంజాబ్ బార్డర్ కు డ్రోన్లు పంపిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.