
- 20 మందితో బీఎస్పీ ఐదో లిస్ట్
- చివరి నిమిషంలో నీలం మధుకు బీఫాం
- మొత్తం 119 స్థానాల్లో బరిలోకి
హైదరాబాద్, వెలుగు : బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను గురువారం అర్ధరాత్రి ప్రకటించింది. 20 మందితో కూడిన లిస్ట్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిలీజ్ చేశారు. ఇందులో సిద్దిపేట జిల్లాలో బీజేపీ నుంచి బీఎస్పీలో చేరిన చక్రధర్ గౌడ్‌కు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్‌లో పేరు ఖరారై, బీఫాం ఇవ్వకపోవడంతో బీఎస్పీ కండువా కప్పుకున్న నీలం మధుకు కేటాయించింది. ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోని బీఎస్పీ ఈసారి119 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి పార్టీ మారిన ముఖ్యనేతలు బీఎస్పీ నుంచి బరిలో నిలుస్తున్నారు. సూర్యాపేటలో వట్టె జానయ్య బీఆర్ఎస్నుంచి వచ్చి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మహేశ్వరం నుంచి టికెట్ఆశించిన కొత్త మనోహర్‌రెడ్డికి కాంగ్రెస్ జాబితాలో చోటు దక్కకపోవడంతో బీఎస్పీలో చేరి పోటీకి దిగారు.
నీలం మధు ఆగమాగం
కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు అభ్యర్థిని మార్చి శ్రీనివాస్ గౌడ్‌కు కేటాయించడంతో అంతకు ముందు జాబితాలో పేరున్న నీలంమధు గందరగోళానికి గురయ్యారు. ఏ పార్టీ నుంచి నామినేషన్ వేయాలనే దానిపై ఆగమాగమయ్యారు. శుక్రవారం తెల్లవారు జామున ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం చేశారు. ఆ తర్వాత బీజేపీ లీడర్లు కూడా ఆయన్ని కలిశారు. అయితే చివరకు నీలం మధు మధ్యాహ్నం 12 గంటలకు బీఎస్పీ కండువా కప్పుకొని ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
ALSO READ: ఎన్నికల వేళ అక్రమ రవాణా కేసుల్లో శిక్షలేవి?